state bank: అకారణంగా ఖాతా నుంచి 115/- కట్ చేసిన ఎస్బీఐ.. కోర్టులో కేసు వేసిన ఖాతాదారు!
- తన అకౌంట్ నుంచి 115 రూపాయలు కట్ చేయడంపై వివరణ కోరిన కృష్ణమోహన్ శర్మ
- బ్యాంకు నుంచి నిర్లక్ష్యపు సమాధానం
- కోర్టును ఆశ్రయించిన ఖాతాదారుడు
తన ఖాతా నుంచి 115 రూపాయలు ఎందుకు కట్ చేశారని అడిగిన ఖాతాదారుడుకి సరైన సమాధానం ఇవ్వని హైదరాబాదు శివారు ఏఎస్ రావు నగర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ పై కేసు నమోదు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దాని వివరాల్లోకి వెళ్తే... ఏఎస్ రావు నగర్ లోని ఎస్బీఐలో నేరేడ్ మెట్ ప్రగతి నగర్ కు చెందిన కృష్ణమోహన్ శర్మ కు ఖాతా ఉంది. పౌరోహిత్యంతో జీవనం సాగించే కృష్ణమోహన్ శర్మ అకౌంట్ నుంచి 115 రూపాయలు కట్ చేసినట్టు బ్యాంకు నుంచి మే 26న ఒక మెసేజ్ వచ్చింది.
దీంతో ఆయన బ్యాంకు కార్యాలయానికి వెళ్లి.. తన అకౌంట్ లోని 115 రూపాయలు ఎందుకు కట్ చేశారని ప్రశ్నించారు. దానికి స్టేట్ మెంట్ వివరాలు ఇచ్చాము కనుక డబ్బులు కట్ చేశామని చెప్పారు. తాను స్టేట్మెంట్ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దీనికి వారు సరైన సమాధానం చెప్పలేదు. దీంతో ఆయన జూలై 4న బ్యాంకు అంబుడ్స్ మన్ కు ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి కూడా సరైన సమాధానం రాలేదు.
నెల రోజులు ఎదురు చూసిన ఆయన, ఆగస్టు 5న బ్యాంకుకు లాయర్ నోటీసు పంపారు. అనంతరం కస్టమర్ కేర్, ఆర్బీఐకి ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి కూడా సరైన సమాధానాలు లేవు. దీంతో కృష్ణమోహన్ శర్మ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా.. కేసు నమోదు చెయ్యలేదు. దీంతో ఆయన నవంబర్ 7న మల్కాజిగిరి కోర్టులో కేసు వేశారు. దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఎస్బీఐపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు.