Israel: ఇజ్రాయిల్ వివాదాన్ని మరింత రాజేసిన ట్రంప్... రాజధాని జరూసలేం అంటున్న పెద్దన్న!

  • టెల్ అవీవ్ నుంచి ఎంబసీని తరలిస్తాం
  • అరబ్ దేశాధినేతలకు స్పష్టం చేసిన ట్రంప్
  • శాంతికి విఘాతమని వాపోతున్న పలు దేశాధినేతలు

ఇజ్రాయిల్ వివాదాన్ని మరింతగా రాజేస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. ఇజ్రాయిల్ కు రాజధాని టెల్ అవీవ్ కాదని, ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న జెరూసలేం మాత్రమే ఆ దేశ రాజధానని స్పష్టం చేసిన ఆయన, మరో ఆరు నెలల్లో అమెరికా ఎంబసీని సైతం జెరూసలేంకు తరలిస్తామని వెల్లడించారు.

అరబ్ నేతలతో సమావేశమైన ఆయన, తన మనసులోని నిర్ణయాన్ని తెలుపుతూ, టెల్ అవీవ్ నుంచి ఎంబసీని తరలించే పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు సూచించనున్నట్టు తెలిపారు. జెరూసలేంను మాత్రమే రాజధానిగా గుర్తించాలన్నది తమ దీర్ఘకాల ఆలోచనని, పాలస్తీనా వాసులతో చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రపంచంలో మూడు మతాలకు అత్యంత పవిత్రమైన నగరంగా ఉన్న జెరూసలేంను ముస్లింలు, యూదులు, క్రైస్తవులు లక్షలాది సంఖ్యలో సందర్శిస్తుంటారన్న విషయం తెలిసిందే.

పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతా అల్ సిసి, సౌదీ రాజు సల్మాన్ తదితరులతో మాట్లాడిన తరువాత ట్రంప్ తన నిర్ణయాన్ని ప్రకటించగా, ఈ ప్రాంతంలో శాంతికి విఘాతం కలుగుతుందని పలు దేశాలు తమ వ్యతిరేకతను వెల్లడించాయి. కాగా, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ట్రంప్ నిర్ణయానికి పూర్తి మద్దతు పలుకుతున్నారు. నేడు ట్రంప్ ఎంబసీని తరలించే విషయమై మీడియాతో మాట్లాడతారని వైట్ హౌస్ ప్రతినిధి సారా శాండర్స్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News