advertising standards council of india: ఇకపై ఆ తరహా ప్రకటనలు రాత్రి పది తరువాతే!: ఏఎస్ సీఐ ఆదేశాలు
- కండోమ్ యాడ్స్ పై కొరడా ఝళిపించిన ఎన్ఎస్ సీఐ
- రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్యలోనే ప్రసారం
- ఉదయం ఆరు నుంచి రాత్రి పది వరకు అసభ్యత, అశ్లీలతకు తావులేని యాడ్స్
కండోమ్ యాడ్స్ ప్రసారం చేసే వేళలను మార్చాలంటూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై అడ్వైర్టైజింగ్ స్టాండర్స్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్ సీఐ) స్పందించింది. దీంతో ఈ రకమైన యాడ్స్ ను రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల మధ్యలో ప్రసారం చేసుకోవచ్చని సూచించింది. టీవీ కార్యక్రమాలు చూస్తున్న వేళల్లో వాణిజ్య ప్రకటనల మధ్యలో కండోమ్ యాడ్స్ వస్తున్నాయని, దీంతో ఆ యాడ్స్ గురించిన ప్రశ్నలు పిల్లలు అడుగుతున్నారని, అంతే కాకుండా కుటుంబం మొత్తం టీవీ చూస్తున్న సమయంలో అలాంటి వాణిజ్య ప్రకటనలు ప్రదర్శించడం వల్ల కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంటోందని పలువురు కేంద్ర సమాచార ప్రసార శాఖకు ఫిర్యాదులు చేశారు.
ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రకటనలు రాత్రివేళ పెద్దలు మాత్రమే చూసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ స్వీయ నియంత్రణ సంస్థ అయిన ఏఎస్ సీఐకి సూచించింది. దీంతో ఏఎస్ సీఐ అన్ని టీవీ ఛానెల్స్ కు ఈ మార్గదర్శకాలు సూచిస్తామని తెలిపింది. అంతే కాకుండా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది వరకు ప్రసారం చేసే యాడ్స్ లో అశ్లీలత, అసభ్యత లేకుండా జాగ్రత్త పడాలని కూడా సూచించింది. కాగా, సన్నీలియోన్ నటించిన కండోమ్ యాడ్ ను ప్రసారం చేయడంతో ఈ వివాదం మొదలైంది.