Rahul Gandhi: రాహుల్ గాంధీనే తన ప్రత్యర్థి అని మోదీకి ఇప్పటికి అర్థమైంది: శివసేన
- ‘పప్పు’ ముద్ర నుంచి రాహుల్ బయటపడ్డారు
- స్వశక్తితో ఎదిగి మోదీకి ప్రత్యర్థిగా మారారు
- ప్రశంసించిన శివసేన ‘సామ్నా’
గుజరాత్ ఎన్నికల యుద్ధం చివరి దశకు చేరుకున్న వేళ రాహుల్ గాంధీ తనకు అసలైన ప్రత్యర్థి అని ప్రధాని మోదీకి ఎట్టకేలకు అర్థమైందని శివసేన పేర్కొంది. నాలుగేళ్ల క్రితం ‘పప్పు’గా అనిపించుకున్న రాహుల్ గాంధీ స్వశక్తితో బలమైన నేతగా ఎదిగారని శివసేన పత్రిక ‘సామ్నా’, ‘దోపహర్ కా సామ్నా’ పత్రికల్లో సంపాదకీయం రాసింది. గుజరాత్ ఎన్నికల్లో ఫలితం ఏదైనా అధికార బీజేపీ బలం మొత్తం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలేనని తేటతెల్లమైందని అందులో ఆరోపించింది.
రాహుల్ గాంధీ చివరికి తాను ‘పప్పు’ను కాదని నిరూపించుకున్నారని, బీజేపీ ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకుని తీరాలని పేర్కొంది. ఇక అంతా తమకు అనుకూలంగా ఉందని, ప్రజలు తమవైపు ఉన్నారన్న భ్రమల నుంచి బీజేపీ బయటకు వస్తే మంచిదని శివసేన సూచించింది. అనుకూలమైన పరిస్థితుల్లో రాహుల్ అధ్యక్ష పదవిని చేపట్టబోతున్నారని సామ్నా పేర్కొంది.
రాహుల్ గాంధీని ఔరంగజేబుతో పోల్చడంపైనా సామ్నా విరుచుకుపడింది. కాంగ్రెస్ వస్తే మొఘలుల రాజ్యం వస్తుందని ప్రచారం చేస్తున్న బీజేపీ మహారాష్ట్రలోని ఔరంగజేబు, అఫ్జల్ సమాధులను కూల్చివేయాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఆదేశించాలని పేర్కొంది.