Pawan Kalyan: అప్పుడు నాకు ఎవ్వరూ గుండు కొట్టించలేదు.. కొట్టిస్తే ఊరుకుంటానా?: పవన్ కల్యాణ్
- తమ్ముడు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు మా చిన్నన్నయ్య ఫోన్ చేశారు
- నాకేదో అయిపోయిందట కదా? అని అడిగారు
- నాకు గుండు కొట్టించారని టీడీపీ వారు ప్రచారం చేశారు
- అయినప్పటికీ నేను దాన్ని వ్యక్తిగతంగా తీసుకోలేదు
రంగాను చంపడం తప్పు.. ప్రతీకార దాడులూ తప్పే!
సమాజం ముందుకు వెళ్లాలంటే కులాల ప్రస్తావన ఉండకూడదని జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రోజు విజయవాడలో ఆయన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... విజయవాడలో ప్రజలు కులాల ఉచ్చులో ఇరుక్కుపోతున్నారని తెలిపారు. వంగవీటి రంగ చనిపోయినప్పుడు ఉన్నది కూడా టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. నిరాయుధుడిగా ఉన్న వ్యక్తిని చంపడం తప్పని అన్నారు. దానికి ప్రతీకారంగా అప్పుడు కమ్మ కులం వారిపై దాడి చేసినందుకు ఆ బాధ చాలా మందిలో ఉండిపోయిందని చెప్పారు.
పరిటాల రవి ఎవరని అడిగాను!
రాష్ట్ర విభజన జరిగిన తరువాత కూడా ఇటువంటి కోపతాపాలే పెట్టుకుంటే అభివృద్ధి జరగదని చెప్పారు. కాపు, కమ్మ, బీసీ, దళిత అంటూ ఇటువంటివి పెట్టుకుంటే అభివృద్ధి జరగదని తెలిపారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. "నేను తమ్ముడు సినిమా షూటింగ్ చేస్తోంటే మా చిన్నన్నయ్య నాకు ఫోన్ చేశారు... పరిటాల రవి నిన్ను తీసుకెళ్లారా? అని అన్నారు. నాకు అసలు అర్థం కాలేదు. అసలు పరిటాల రవి ఎవరని అడిగాను. అలాగే నాకు ఎవరో వచ్చి గుండు కొట్టించారని అప్పట్లో పెద్ద పుకారు. నాకు ఒకరు గుండు కొట్టిస్తే నేను ఊరుకునే మనిషినా? నాకే చిరాకనిపించి అప్పుడు గుండు చేయించుకున్నాను. టీడీపీ వారే ఇటువంటి పుకార్లు చేశారు.
జగన్‌పై అభియోగాలు లేకుంటే..!
టీడీపీ నుంచి ఇన్ని జరిగినప్పటికీ నేను వాటిని వ్యక్తిగతంగా తీసుకోలేదు.. ఇవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు. కులాల ఐక్యత కావాలి. కేవలం ప్రపంచ స్థాయి రాజధాని కావాలంటే కులాల ఐక్యత కావాలి, లేదంటే చాలా కష్టాలు వస్తాయి. లేదంటే ఇక్కడ అమరావతిలో రాజధాని పెట్టడం చాలా ప్రమాదం. కులాల మధ్య ఐక్యత ఉండాలనుకున్నప్పుడు జగన్‌కు సపోర్ట్ చేయొచ్చు కదా? అని కొందరు అనుకోవచ్చు. జగన్‌పై అభియోగాలు లేకుంటే నాకు అంతగా ఇబ్బంది ఉండేది కాదు.. కేసులున్నప్పుడు ఆయనకు సపోర్ట్ చేయకూడదని చేయలేదు" అని చెప్పారు పవన్.