Prakash Raj: మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా?: మరోసారి మండిపడ్డ ప్రకాశ్ రాజ్
- హిందుత్వం-జాతీయత ఒక్కటేనన్న కేంద్ర మంత్రిపై ఆగ్రహం
- భారత్ లౌకికవాద దేశం
- ఈ సిగ్గులేని రాజకీయాలతో దేశానికి ఒరిగేది ఏంటి?
- ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని సదరు మంత్రి భావిస్తున్నారేమో
హిందుత్వం-జాతీయత ఒక్కటేనని కేంద్ర మంత్రి అనంతకుమార్ హెగ్డే వ్యాఖ్యానించడంపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. హిందుత్వం-జాతీయత ఒక్కటేనని చెబుతున్న ఆ మాటకు అర్థం కూడా వివరిస్తే బాగుంటుందని ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇస్లాం మతాన్ని ప్రపంచంలోనే లేకుండా చేయాలని సదరు మంత్రి భావిస్తున్నారేమోనని అన్నారు. హిందుత్వం-జాతీయత ఒక్కటేనని అంటున్నప్పుడు అసలు మతం విషయాన్ని లేవనెత్తటం ఎందుకని ప్రశ్నించారు.
అంబేద్కర్, అబ్దుల్ కలాం, అమృత ప్రీతమ్, డాక్టర్ కురియన్, రెహమాన్, కుష్వంత్ సింగ్ వీరంతా ఎవరు? అని నిలదీశారు. దేశంలో తనలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటని ప్రకాశ్‌రాజ్ నిలదీశారు. మానవత్వాన్ని నమ్మేవారు దేశానికి చెందిన వాళ్లు కాదా? అని ప్రశ్నించారు. అసలు మీ ఎజెండా ఏంటని, పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్‌కు ప్రతీకలా? అని ప్రకాశ్ రాజ్ అడిగారు. భారత్ లౌకికవాద దేశమని, ఈ సిగ్గులేని రాజకీయాలతో దేశానికి ఒరిగేది ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.