Chittoor: పొలం సరిహద్దు వివాదంలో ఘోరం.. రొటోవేటర్‌తో తొక్కించి మహిళ హత్య!
- చిత్తూరు జిల్లా యాదమరి మండలంలో ఘటన
- మహిళను కిరాతకంగా హత్య చేసిన నిందితుడు
- ఇనుపరాడ్డుతో ఆమె భర్తపైనా దాడి
చిత్తూరు జిల్లా యాదమరి మండలం వరిగపల్లెలో జరిగిన ఓ హత్యోదంతం పోలీసులనే దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ హత్య జిల్లాలో పెను సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రంజిత్, జగన్నాథరెడ్డికి మధ్య పొలం సరిహద్దు విషయంలో కొన్నేళ్లుగా వివాదం ఉంది. కోర్టులో కేసు కూడా నడుస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం వివాదాస్పద పొలంలో జగన్నాథరెడ్డి, అతని భార్య విమలమ్మ (52) రొటేవేటర్ బిగించిన ట్రాక్టర్‌తో పనులు చేస్తున్నారు. ఇది చూసిన రంజిత్ స్నేహితుడు గోవిందరాజులు వీరిని అడ్డుకున్నాడు. దీంతో పనులను ఆపేసిన జగన్నాథరెడ్డి ట్రాక్టర్‌ను ఆపేసి పొలం గట్టుకు చేరుకున్నాడు. అదే సమయంలో పొలం వద్దకు చేరుకున్న రంజిత్ అదే ట్రాక్టర్‌తో పక్కనే ఉన్న జగన్నాథరెడ్డికి చెందిన జొన్న పొలాన్ని తొక్కించడంతోపాటు గట్టుపై నిలబడి ఉన్న విమలమ్మను ఢీకొట్టాడు. కింద పడిపోయిన ఆమెపై నుంచి ట్రాక్టర్ ఎక్కించాడు. దీంతో ట్రాక్టర్ వెనక ఉన్న రొటేవేటర్లో చిక్కుకుపోయిన విమలమ్మ అక్కడికక్కడే మృతి చెందింది.
అనంతరం ట్రాక్టర్ దిగిన రంజిత్ విమలమ్మ భర్త జగన్నాథరెడ్డిపై ఇనుప రాడ్డుతో దాడి చేయడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.