undavalli: పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇచ్చింది: ఉండవల్లి
- చంద్రబాబు నిజాలు చెప్పాలి
- లేకపోతే, కుట్ర దాగుందని ప్రజలు భావిస్తారు
- చంద్రబాబు సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలి
- పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్ర సర్కారుదే
పోలవరం పనులపై కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పుడు నివేదికలు ఇచ్చిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... పోలవరం పనుల్లో జరుగుతోన్న జాప్యంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిజాలు చెప్పాలని లేకపోతే, కుట్ర దాగుందని ప్రజలు భావిస్తారని వ్యాఖ్యానించారు. పోలవరం పనులు చేయకుండానే ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిందని ఆరోపణలు చేశారు.
దమ్ముంటే కేంద్రానికి ఏపీ సర్కారు ఇచ్చిన నివేదికపై చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్ర సర్కారుదేనని ఆయన అన్నారు. పోలవరం అథారిటీని కూడా ఏర్పాటు చేశారని, ఈ పనుల బాధ్యత అథారిటీదేనని, అథారిటీకి తెలియకుండా టెండర్లు ఎలా పిలిచారని ఆయన నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు సర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.