Pawan Kalyan: నేను ముఖ్యమంత్రిని కాను... అనుభవం కోసమే పార్టీ: పవన్ కల్యాణ్
- సీఎం పదవి కష్టమైనది
- బాధ్యత నెరవేర్చాలంటే అనుభవం కావాలి
- అధికారం లేకున్నా ఫర్వాలేదు
- జనసేనాని పవన్ కల్యాణ్
నిన్న ఒంగోలులో పవన్ కల్యాణ్ పర్యటించిన వేళ, ఆయన అభిమానులు "సీఎం పవన్" అని పదే పదే నినదిస్తున్న వేళ, ఆయన స్పందించారు. తానేమీ సీఎంను కానని, అనుభవం కోసమే పార్టీని ముందుకు తీసుకెళుతున్నానని అన్నారు. "మీరు సీఎం సీఎం అన్నా నేను కాను. నాకు ఇష్టం లేదు. సీఎం పదవి చాలా కష్టమైనది. ఎంతో బాధ్యతతో కూడినది. అందుకు అనుభవం కావాలి" అన్నారు. తనకు అధికారం ఉన్నా, లేకున్నా ఫర్వాలేదని, ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు.
కేవలం మేకప్ వేసుకుని కూర్చోబోనని, అవసరమైతే ప్రజల తరఫున పోరాడేందుకు ఆయుధం పడతానని చెప్పారు. వచ్చే సంవత్సరం మార్చిలో జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల ప్లీనరీని నిర్వహిస్తామని, ఆ సమావేశాల తరువాత మరింతగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళతానని పవన్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీలూ కలసి ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడి, తమ డిమాండ్ ను నెరవేర్చుకున్నాయని గుర్తు చేస్తూ, ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలూ అలా ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు.