Nitin Gadkary: భారీగా తగ్గనున్న పెట్రోలు ధరలు!
- సూచన ప్రాయంగా తెలిపిన గడ్కరీ
- బడ్జెట్ సమావేశాల్లో నూతన పెట్రో విధానం
- 15 శాతం మిథనాల్ మిశ్రమాన్ని కలిపే ఆలోచన!
దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా తగ్గేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. త్వరలోనే పెట్రోలు రేట్లు తగ్గేలా కొత్త పాలసీని తీసుకురానున్నామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచన ప్రాయంగా వెల్లడించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన ప్రతిపాదన సభ ముందుకు వస్తుందని, అది ఏంటన్నది వేచి చూడాలని అన్నారు.
కాగా, పెట్రోలులో 15 శాతం మెథనాల్ మిశ్రమాన్ని కలిపేందుకు చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. మిథనాల్ కలపాలన్న నిర్ణయం అమలైతే, పెట్రో ఉత్పత్తుల ధరలు 10 శాతం వరకూ తగ్గుతాయి. మిథనాల్ మిశ్రమం వాడిన పెట్రోలు సాధారణ పెట్రోలుతో పోలిస్తే, తక్కువ కాలుష్యాన్ని వెదజల్లుతుంది.
లీటరు పెట్రోలు ధర రూ. 80 అనుకుంటే, మిథనాల్ కేవలం రూ. 22కే లభిస్తుంది. ఇప్పటికే పెట్రోలును కూడా జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తెచ్చి, గరిష్ఠంగా ఉన్న 28 శాతం శ్లాబులో ఉంచినా, కనీసం రూ. 17 నుంచి రూ. 20 వరకూ ధర తగ్గుతుంది.