Virat Kohli: కళ్లు బైర్లు కమ్మేంత సంపద... విరాట్, అనుష్కల ఆస్తి వివరాలు!
- రెండు చేతులా సంపాదిస్తున్న కోహ్లీ, అనుష్క
- ఇద్దరి ఆస్తులూ కలిపితే రూ. 600 కోట్లకు పైగానే
- నేడు ఇటలీలో వివాహం
విరాట్ కోహ్లీ... భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా, ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ, ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో 7వ స్థానంలోను, ఇండియా ఆటగాళ్లలో మొదటి స్థానంలోను నిలిచిన వ్యక్తి. ఇక అనుష్క శర్మ విషయానికి వస్తే, 'రబ్ నే బనాది జోడీ' చిత్రంతో బాలీవుడ్ లో పేరు తెచ్చుకుని, ఓ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించడంతో పాటు ఓక్కో చిత్రానికి రూ. 5 కోట్ల వరకూ, ఏదైనా కంపెనీకి ప్రచారం తీసుకోవాల్సి వస్తే రూ. 4 కోట్లను తీసుకుంటున్న నటి.
ఇక వీరిద్దరి వివాహం రేపు ఇటలీలో జరగనున్న వేళ, వీరికి ఉన్న ఆస్తుల వివరాలపై ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అనుష్క వద్ద రూ. 36 కోట్ల వ్యక్తిగత పెట్టుబడులు ఉన్నాయని, నాలుగు లగ్జరీ కార్లు, ఇల్లు, వ్యాపారాల్లో భాగస్వామ్యం మొత్తం కలిపి రూ. 220 కోట్లని తెలుస్తోంది. త్వరలోనే ఆమె ఆస్తుల విలువ రూ. 300 కోట్లను దాటేస్తుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
ఇక కోహ్లీ, ఐపీఎల్ మ్యాచ్ లలో అత్యధికంగా ఫీజులు తీసుకుంటూ, పోటీలు జరిగే రెండు నెలల కాలంలోనే రూ. 14 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇక ఎంఆర్ఎఫ్, ప్యూమా వంటి బ్రాండ్స్ కు ప్రచారం చేస్తూ, ఏటా కోట్లకు కోట్లు సంపాదిస్తున్నాడు. కోహ్లీ పేరిట రూ. 42 కోట్ల విలువైన ఆస్తులు, 18 కోట్ల ఇన్వెస్ట్ మెంట్స్, ఆరు లగ్జరీ కార్లు తదితరాలెన్నో ఉన్నాయి. మొత్తంగా చూస్తే కోహ్లీ పేరిట రూ. 390 కోట్ల వరకూ ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరి ఆస్తి కలిపితే అది రూ. 600 కోట్లను ఇట్టే దాటేస్తుంది. వామ్మో అనిపిస్తోందా? ఈ సంపద భవిష్యత్తులో మరింతగా పెరుగుతుంది కూడా.