Donald Trump: అమెరికా అధ్యక్షుడు రోజుకి నాలుగు గంటలపాటు టీవీ చూస్తారట!
- వార్తాఛానళ్లు మాత్రమే చూసే ట్రంప్
- ట్వీట్లకు అవే ఆధారం
- వెల్లడించిన న్యూయార్క్ టైమ్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకి నాలుగు గంటల పాటు టీవీ చూస్తారని అక్కడి న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ట్రంప్‌కి దగ్గరగా ఉండే వారి సమాచారం మేరకు ఆయన ఉదయం 5.30గం.లకే లేచి టీవీ చూడటం మొదలుపెడతారని తెలిపింది. సీఎన్ఎన్, ఫాక్స్ న్యూస్, ఎంఎస్ఎన్బీసీ వంటి వార్తాఛానళ్లు చూసి తన గురించి గానీ, ప్రభుత్వ పాలన గురించి గానీ ఏదైనా విషయం ఉంటే దాన్ని ఖండిస్తూనో, మద్దతు తెలుపుతూనో ట్వీట్ చేస్తారని వెల్లడించింది.
కొన్ని సార్లు రోజుకి 8 గం.ల పాటు టీవీ చూస్తారని, తాను ఏర్పాటు చేసిన మీటింగ్ గదుల్లో ఎక్కడైనా టీవీ ఉంటే స్క్రోలింగ్ రూపంలో వచ్చే బ్రేకింగ్ న్యూస్‌లను చదివి చర్చిస్తుంటారని న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది. లైవ్ ప్రోగ్రామ్ చూసే అవకాశం దొరకకపోతే రికార్డెడ్ చూస్తారని పేర్కొంది. అయితే తాను అస్సలు టీవీ చూడనని, అలా వచ్చిన వార్తలన్నీ తప్పుడు వార్తలని గతంలో ట్రంప్ కొన్నిసార్లు చెప్పారు.
కానీ ఆయన ట్వీట్లు చూస్తే మాత్రం తప్పకుండా టీవీ చూస్తారనే విషయం అర్థమవుతుంది. న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన ఈ కథనం ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా అన్ని వార్తాఛానళ్లలో వచ్చింది. వైట్‌హౌస్ గానీ, ట్రంప్ గానీ ఇంకా దీనిపై ఎలాంటి స్పందన ఇవ్వలేదు.