telangana: శుభవార్త.. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 3943 పోస్టుల భర్తీకి జీవో జారీ.. వివరాలు!
- త్వరలో నియామకాలకు మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం
- సివిల్ సర్జన్/సివిల్ సర్జన్ ఆర్ఎంఓ పోస్టులు-483
- డిప్యూటీ సివిల్ సర్జన్ -685
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ -1191
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 3943 పోస్టులకు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో ఎం.ఎస్ నెంబర్ 179 జారీ చేసింది. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని వివిధ ఆసుపత్రుల్లో ఆయా పోస్టులను భర్తీ చేస్తారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.... సీఎం కేసీఆర్ ఔదార్యంతో వచ్చిన ఈ పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామని అన్నారు. అడిగిందే తడవుగా పోస్టుల మంజూరుకు ఆదేశించిన సీఎంకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్యశాలల్లో ఆధునిక వసతులు పెంచడం, కొత్తగా ఆసుపత్రుల్ని నిర్మించడం, ఉన్న వైద్యశాలలను అప్‌గ్రేడ్ చేయడం, కేసీఆర్ కిట్ల పథకం వంటి అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు.
వీటి వల్ల ప్రభుత్వ వైద్యశాలలకు పేషంట్ల రాక పెరిగిందన్నారు. దీంతో ఇప్పటిదాకా కొంత మేరకు ఉన్న వైద్య సేవల కొరత తాజాగా చేపట్టే నియామకాలతో తీరుతుందన్నారు. భారీ ఎత్తున డాక్టర్లు, సిబ్బంది వస్తారన్నారు. ఒక్క తెలంగాణ వైద్య విధాన పరిషత్‌తోనే 3943 పోస్టులు వస్తున్నాయన్నారు. ఇవేగాక మిగతా విభాగాల్లోనూ అనేక పోస్టులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ నియామకాలు ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి వీలవుతుందన్నారు.
వివిధ కేటగిరీల్లో పోస్టుల వివరాలు..
డాక్టర్లు
- సివిల్ సర్జన్/సివిల్ సర్జన్ ఆర్ఎంఓ -483
- డిప్యూటీ సివిల్ సర్జన్ -685
- సివిల్ అసిస్టెంట్ సర్జన్ -1191
- డెంటల్ సివిల్ సర్జన్ -12
- డిప్యూటీ డెంటల్ సర్జన్ -16
- డెంటల్ అసిస్టెంట్ సర్జన్ -10
ఇతర సిబ్బంది
అసిస్టెంట్ డైరెక్టర్ (అడ్మిన్) ఎల్.ఎస్. గ్రేడ్-1 -02
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ /ఎల్.ఎస్. గ్రేడ్-2 -16
సూపరింటెండెంట్ /సెక్షన్ ఆఫీసర్ -32
సీనియర్ అసిస్టెంట్ -30
జూనియర్ అసిస్టెంట్ -56
ఫార్మసీ సూపర్ వైజర్ -01
ఫార్మసిస్ట్ గ్రేడ్-1 06
ఫార్మసిస్ట్ గ్రేడ్-2 -52
ల్యాబ్ టెక్నీషియన్ -152
హెల్త్ ఇన్స్పెక్టర్ -09
చీఫ్ రేడియోగ్రాఫర్ - 07
రేడియోగ్రాఫర్ -33
డార్క్ రూమ్ అసిస్టెంట్ -36
ఫిజియోథెరపిస్ట్ -45
రిఫ్రాక్షనిస్ట్ -34
జూనియర్ అనలిస్ట్ -44
ఆప్తాలమిస్ట్ అసిస్టెంట్ -22
ఆడియోమెట్రీ టెక్నీషియన్ -01
నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1 -28
నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-2 -38
హెడ్ నర్స్-162
స్టాఫ్ నర్స్ -565
మిడ్‌వైవ్స్ -126
ఎఎన్ఎం/ఎంపిహెచ్ఎ (ఎఫ్) 49
హర్షం వ్యక్తం చేసిన వివిధ వైద్య సంఘాలు..
తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో 3943 పోస్టులు రావడం పట్ల వివిధ వైద్య సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ప్రవీణ్ పల్లం, ఉపాధ్యక్షుడు డాక్టర్ నరహరి, కోశాధికారి డాక్టర్ లాలు మాట్లాడుతూ... వైద్య రంగ సమస్యలే కాక, వైద్యులు, సిబ్బంది సమస్యలు తెలిసిన సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, కమిషనర్ వాకాటి కరుణలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్టుల నియామకాలు పూర్తయితే ఒకవైపు వైద్యులు, సిబ్బంది కొరత తీరడమేగాక, మరోవైపు రోగులకు మంచి వైద్యం అందించడానికి వీలవుతుందన్నారు. వైద్యులు, సిబ్బంది మీద భారం తగ్గుతుందన్నారు.