TRS: మంత్రి చందూలాల్ కుమారుడి తిట్ల పురాణం.. మహబూబాబాద్ ఎంపీపై బూతులు.. టీఆర్ఎస్లో కలకలం!
- కార్యకర్త నిలదీయడంతో అగ్గిమీద గుగ్గిలమైన మంత్రి కుమారుడు
- అసభ్య పదజాలంతో మహబూబాబాద్ ఎంపీని దూషించిన వైనం
- టీఆర్ఎస్లో కలకలం రేపుతున్న ప్రహ్లాద్ వ్యాఖ్యలు
తెలంగాణ మంత్రి చందూలాల్ కుమారుడు, ములుగు పీఏసీఎస్ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్ బూతుపురాణం ఆడియో క్లిప్పింగ్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓ కార్యకర్తతో జరిగిన వాగ్వాదంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్పై ప్రహ్లాద్ నోరు పారేసుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం జంగాలపల్లికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త కె.రవిదాసు మంత్రి కుమారుడికి ఫోన్ చేశారు. నిన్నమొన్న వచ్చిన వారికి పార్టీలో పదవులు దక్కుతున్నాయని, తనకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ వాదనకు దిగారు.
కార్యకర్త వాదనతో ఆగ్రహానికి లోనైన ప్రహ్లాద్ 'పార్టీలో ఉంటే ఉండు, పోతే పో..' అని దురుసుగా సమాధానం చెప్పారు. దీంతో కార్యకర్త కాస్తంత గట్టిగా మాట్లాడుతూ ‘‘మేమెందుకు పోతాం సార్’’ అని అన్నాడు. దీంతో రెచ్చిపోయిన మంత్రి కుమారుడు.. ‘‘ఎంపీ పేరు చెబుతున్నావ్, వాడు వచ్చి పీకుతాడా? ఏంటి ఎంపీ గొప్ప?’’ అంటూ బూతులు అందుకున్నారు.
‘’ఎంపీ మా నియోజకవర్గానికి వచ్చి పీకుతాడా. నువ్వు ఎంపీ దగ్గరికే వెళ్లాలి. వాడు నీకు ఏం పదవి ఇస్తాడో చూస్తా’’ అంటూ రంకెలు వేశారు. అంతేకాదు.. ‘‘వాడి పేరు చెప్పి నన్ను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నావా?’’ అని ప్రశ్నించారు. మొత్తం మూడు నిమిషాలపాటు సాగిన వీరి సంభాషణ ఇప్పుడు వైరల్ అయింది. అంతేకాదు.. టీఆర్ఎస్లో కలకలం రేపుతోంది.