Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ నిర్లక్ష్యం... డీఎస్పీ మరణాన్ని రికార్డు చేయని డీజీపీ కార్యాలయం
- చనిపోయిన డీఎస్పీని పోలీసు హెడ్క్వార్టర్స కు రావాలని ఆదేశం
- ఉదంతాన్ని బయటపెట్టిన మీడియా
- గుమాస్తా తప్పిదమని వివరణ ఇచ్చిన డీజీపీ కార్యాలయం
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా పనిచేస్తున్న డి. రామాంజనేయులు ఇటీవల అస్వస్థతతో మృతి చెందారు. ఆయన స్థానంలో మరో అధికారి రామ్ కుమార్‌కు బదిలీ పోస్టింగ్ ఇస్తూ రామాంజనేయులుని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌కి రిపోర్టు చేయాలని డీజీపీ కార్యాలయం నుంచి వెలువడిన బదిలీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పోలీసు శాఖలో ఈ పోస్టింగ్ కలకలం సృష్టించింది.
చనిపోయిన అధికారి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎలా రిపోర్ట్ చేస్తారంటూ పలువురు ఈ ఉత్తర్వులను చూసి నవ్వుకుంటున్నారు. ఓ డీఎస్పీ స్థాయి అధికారి చనిపోయినా దానిని రికార్డ్ చేయకుండా డీజీపీ కార్యాలయం ఈ రకంగా ఉత్తర్వులు జారీ చేయడం పోలీసు శాఖ పనితీరుకు అద్దం పడుతోందని జనాలు విమర్శిస్తున్నారు. అయితే జరిగిన తప్పు మీడియాకు తెలియడంతో వెంటనే డీజీపీ కార్యాలయం నుంచి గుమాస్తా తప్పిదం కారణంగా ఈ తప్పు జరిగిందని వివరణ వెలువడింది.