Kollywood: విశాల్ పోటీ చేయడం తప్పెలా అవుతుంది?.. ప్రశ్నించిన నటుడు శరత్ కుమార్
- తన పేరుతో రూపొందించిన యాప్ను విడుదల చేసిన శరత్ కుమార్
- విశాల్ నామినేషన్ తిరస్కరణను పెద్దది చేయొద్దని సూచన
- నటీనటుల సంఘంలో ఐక్యత లోపించిందన్న సీనియర్ నటుడు
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి సినీ నటుడు విశాల్ పోటీ చేయడంలో తప్పేముందని సీనియర్ నటుడు శరత్ కుమార్ ప్రశ్నించారు. ‘ఏఎస్కే’ పేరుతో తన పేరుతో రూపొందించిన యాప్ను మంగళవారం చెన్నైలో శరత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమయ్యేందుకే ఈ యాప్ను రూపొందించినట్టు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, విశాల్ పోటీ చేయడంలో తప్పేంటని ప్రశ్నించారు.
విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయాన్ని పెద్దది చేయడం సరికాదన్నారు. ఇదేమీ పెద్ద సమస్య కాదన్నారు. ఎంజీఆర్ నామినేషన్ కూడా తిరస్కరణకు గురైన సందర్భాలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. నటీనటుల సంఘంలో ఐక్యత లోపించిందన్న శరత్ కుమార్, సమస్యల పరిష్కారానికి అందరూ ఏకతాటిపైకి వచ్చి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధిక, ఆమె కుమార్తె రయాన్, నటి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.