Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చుట్టూ 'మీ టూ' ఉచ్చు... రాజీనామాకు మహిళా సభ్యుల పట్టు!
- లైంగిక వేధింపులను వెలుగులోకి తెస్తున్న 'మీ టూ'
- అధ్యక్షుడిపై విచారణ జరిపించాల్సిందే
- డిమాండ్ చేస్తున్న మహిళా కాంగ్రెస్ సభ్యులు
ఉన్నత స్థానాల్లో ఉన్న వారి లైంగిక వేధింపుల పర్వాలను వెలుగులోకి తెస్తున్న 'మీ టూ' ప్రచారం, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చుట్టుకుంటోంది. ఆయన ఎన్నికల్లో పోటీకి నిలబడినప్పటి నుంచి ఎంతో మంది లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆయన అధ్యక్షుడిగా ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో డెమోక్రాటిక్ పార్టీ మహిళా ప్రజా ప్రతినిధులు ట్రంప్ తక్షణమే రాజీనామా చేయాలని, ఆయనపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు కాంగ్రెస్ సభ్యులతో కూడిన కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు న్యూయార్క్ లో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ పై జెస్సీకా లీడ్స్, రేఛల్ క్రూక్స్, సమంతా హాల్వేలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఇదే సమయంలో 16 మంది మహిళలు ట్రంప్ తమను లైంగికంగా వేధించాడని చెబుతున్న దృశ్యాలతో కూడిన ఓ వీడియోను 'బ్రేవ్ న్యూ ఫిల్మ్' అనే సంస్థ విడుదల చేయడం కలకలం రేపుతోంది. తమ అనుమతి లేకుండా ముద్దు పెట్టుకున్నాడని, తాకరాని చోట తాకాడని, గట్టిగా పట్టుకున్నాడని, దుస్తుల లోపలికి చేతులు పెట్టి నొక్కేవాడని వారు ఈ వీడియోలో ఆరోపిస్తుండగా, దాని ఆధారంగా విచారణకు ఇప్పుడు విపక్ష మహిళా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.