rahul: యువరాజుకు నేడే పట్టాభిషేకం... రాహుల్ గాంధీ ముందు ఎన్నో సవాళ్లు!
- కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు
- ఇప్పటి వరకు రాహుల్ రాణించిందేమీ లేదు
- ఇకపై ఎంత వరకు సక్సెస్ అవుతారన్నది ప్రశ్నే!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ నేడు తన మాతృమూర్తి సోనియాగాంధీ నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల పార్టీ పరంగా నిర్వహించిన ఎన్నికల్లో రాహుల్ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. 2007 నుంచి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, 2013 నుంచి ఉపాధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చారు. తదుపరి అధ్యక్ష పీఠం ఎక్కడమే ఆలస్యం అని అప్పట్లోనే ఊహించారు. నేడు అదే నిజం అవుతోంది.
కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ తర్వాత పార్టీని అంత సమర్థంగా నిర్వహించగలిగింది సోనియాగాంధీయే అని చెప్పుకోవాలి. రాజీవ్ మరణం తర్వాత రెండేళ్ల విరామం అనంతరం తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను సోనియా తన భుజస్కందాలపై వేసుకుని అందరినీ ఒక్కతాటిపై నడిపించారు. రాహుల్ గాంధీకి పార్టీలో చోటు కల్పించి అనుభవం నేర్పే ప్రయత్నం చేశారు. అయితే, తండ్రి రాజీవ్ గాంధీ మాదిరిగా రాహుల్ కూడా రాజకీయాల పట్ల మొదట్లో అంత సుముఖత చూపించలేదనేది పరిశీలకుల అభిప్రాయం. అయినా పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఆయన వరకు రానే వచ్చింది. సోనియా గాంధీ అనారోగ్యం కారణంతో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
ఇక కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న రాహుల్ గాంధీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాని మోదీ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీ 2014లో ఓటమిపాలైంది. రెండు పర్యాయాల యూపీఏ పాలనా వైఫల్యాలు కూడా ఇందుకు తోడ్పడ్డాయి. అయితే, మోదీ సంస్కరణల మంత్రం, ఆయనకున్న అనుభవం, వాగ్ధాటిని ఎదుర్కొనే సత్తా రాహుల్ కు లేదని చాలా మంది అంటుంటారు. వీటన్నిటినీ దీటుగా ఎదుర్కొని 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయ శిఖరాల వైపు నడిపించగల శిఖర బాధ్యత రాహుల్ పై పడింది.
కానీ, రాహుల్ ఇంత వరకూ చాలా రాష్ట్రాల ఎన్నికల్లో లోక్ సభ ఎన్నికల్లో ప్రచారం చేసినప్పటికీ ఎక్కడా కూడా ప్రజల్ని ప్రభావితం చేయలేకపోయారు. 2019లోపు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అవి రాహుల్ కు తక్షణ పరీక్ష కాగలవు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉంది. ఇక్కడ వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్ ఎన్నికలనూ ఎదుర్కోవాల్సి ఉంది. మరోవైపు కాంగ్రెస్ మిత్ర పక్షాలు కూడా వివిధ రాష్ట్రాల్లో బలహీనపడ్డాయి. ఈ నేపథ్యంలో రాహుల్ కాంగ్రెస్ పార్టీని ఎంత సమర్థంగా నడిపించి 2019లో విజయానికి చేరువ చేస్తారో చూడాల్సిందేనన్నది విశ్లేషకుల భావన.