selfie video: అందుకే అజ్ఞాతంలోకి... వనితారెడ్డి సెల్ఫీ వీడియో విడుదల!
- హాస్యనటుడు విజయ్సాయి ఆత్మహత్య కేసు
- కూతురి భవిష్యత్తు కోసమే ఇలా అజ్ఞాతంలోకి
- విజయ్ తల్లి, తండ్రి నన్ను నేరస్తురాలిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు
- మూడేళ్లుగా దూరంగా ఉంటున్నాం.. ఆ ఆత్మహత్యకు నేనెలా కారణం?
హాస్యనటుడు విజయ్సాయి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన భార్య వనితా రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓ సెల్ఫీ వీడియోను పంపింది. త్వరలోనే తాను పోలీసులకు లొంగిపోతానని తెలిపింది. విజయ్ ఆత్మహత్యతో తనకే సంబంధం లేదని, అయినప్పటికీ అతని మరణానికి కారణం తానేనని కొందరు ఆరోపిస్తున్నారని, విజయ్ చేసిన తప్పులను గురించి ఎవ్వరూ మాట్లాడడం లేదని చెప్పింది.
విజయ్ తల్లి, తండ్రి తనను నేరస్తురాలిగా చూపడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపింది. విజయ్ ఆత్మహత్య గురించి తన అత్తామామలు ఆలోచిస్తున్నారని, తన కూతురి భవిష్యత్తు గురించి ఏ మాత్రం ఆలోచించడం లేదని పేర్కొంది. తన కూతురి భవిష్యత్తు కోసమే తాను ఇలా అజ్ఞాతంలోకి వచ్చానని తెలిపింది. కార్లు, బంగారం, ఆస్తి నేను తీసుకున్నానని వారు చెబుతున్నారని, నిజానికి తన కార్లు, బంగారమే వారు తీసుకున్నారని పేర్కొంది. కావాలంటే ఇదివరకు తాను కోర్టులో చేసిన ఫిర్యాదు చూడవచ్చని తెలిపింది.
తాను వారిపై ఏయే కేసులు వేశానో కోర్టులో తెలుసుకోవచ్చని, మూడేళ్లుగా నాకు దూరంగా ఉన్న విజయ్ ఇప్పుడు నా వల్లే ఆత్మహత్య ఎలా చేసుకుంటాడు? అని ప్రశ్నించింది. ఇది సరైంది కాదని, తనపై నిందలు మోపడానికి మాత్రమే ఇలా చేస్తున్నారని చెప్పింది.