telugu sabhalu: నోరూరిస్తోన్న వంటకాలు.. తెలుగు మహాసభల్లో విందు భలే పసందు.. ఫొటోలు!
- పట్టువడియాల పులుసు, వంకాయ బగారా, బెండకాయ ఫ్రై రుచులు అదరహో
- విందు ఏర్పాట్లను పరిశీలించి రుచి చూసిన మంత్రి ఈటల
- తెలుగు రుచిని ఆస్వాదిస్తోన్న సాహితీప్రియులు
- పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో భోజనాల నిర్వహణ
హైదరాబాద్‌లో కొనసాగుతోన్న ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ సర్కారు చేసిన భోజన ఏర్పాట్లు నోరూరిస్తున్నాయి. అతిథులను, ఆహ్వానితులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రోజు తెలుగు మహాసభలకు వచ్చిన వారు విందు భోజనాన్ని ఆస్వాదిస్తూ తెలుగు రుచి భళా అంటూ కితాబిచ్చారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ సభలకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో భోజనాల నిర్వహణ జరుగుతోంది.
రెండోరోజు ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతోన్న హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియం, రవీంద్ర భారతి, తెలుగు విశ్వవిద్యాలయం, లలిత కళా తోరణంలో భోజన ఏర్పాట్లను మంత్రి ఈటెల రాజేందర్ పలువురు అధికారులతో కలిసి పరిశీలించి, విందు భోజనం రుచి చూశారు. పెళ్లి భోజనం తరహాలో వండివండిచడం సాహితీ ప్రియులందరికీ మంచి అనుభూతినిచ్చింది. వెజ్ బిర్యానీ, పట్టువడియాల పులుసు, వంకాయ బగారా, బెండకాయ ఫ్రై, పాలకూర పప్పు, చింతకాయ, పండుమిర్చిల చట్నీ, దొండకాయ పచ్చడి, పచ్చిపులుసు, టమోటా రసం, చింతపండు పులిహోర, పిండివంటల రుచి అదరహో అనిపిస్తున్నాయి.