theatre: మార్చి నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్... ప్రకటించిన టీఎఫ్‌సీసీ
- డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల అధిక ఛార్జీలకు నిరసనగా బంద్
- ఛార్జీలు తగ్గించే వరకు సమ్మె చేస్తామంటున్న టీఎఫ్‌సీసీ
- సందిగ్ధంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్ సినిమాలు
డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లు (డీఎస్పీ) విధిస్తున్న అధిక ఛార్జీలకు నిరసనగా మార్చి 2018 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ పాటించనున్నట్లు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది. ఈ ప్రకటనతో చిత్రపరిశ్రమలో కొత్త ఆందోళనలు మొదలయ్యాయి. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లతో సమస్యపై టీఎఫ్‌సీసీ ఎప్పటినుంచో నిరసన వ్యక్తం చేస్తోందని, అయితే ఈసారి మాత్రం ఛార్జీలు తగ్గించే వరకు సమ్మె చేస్తామని టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు పి. కిరణ్ తెలిపారు.
ప్రస్తుతం ఒక సినిమా డిజిటల్ ప్రదర్శన కోసం డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు వారానికి రూ. 20,000లు చెల్లిస్తున్నట్లు టీఎఫ్‌సీసీ జనరల్ సెక్రటరీ ముత్యాల రామదాస్ వెల్లడించారు. 'డీఎస్పీలు తమ పరికరాలను ఎగ్జిబిటర్‌కి అందజేస్తున్న కారణంగా ఈ ఛార్జీలను ఎగ్జిబిటర్ గానీ, డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ గానీ భరించాలి. కానీ వీటిని డిస్ట్రిబ్యూటర్ల మీద రుద్దడం ఎంతవరకు సమంజసం?' అని రామదాస్ ప్రశ్నించారు.
టీఎఫ్‌సీసీ చేసిన ఈ ప్రకటనతో మార్చి తర్వాత విడుదలకు సిద్ధం చేసిన సినిమాల నిర్మాతలు గాబరా పడుతున్నారు. ఏప్రిల్‌లో మహేశ్ బాబు 'భరత్ అనే నేను', అల్లు అర్జున్ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' చిత్రాలు విడుదలకానున్న సంగతి తెలిసిందే. మరి వీటి భవితవ్యం ఏంటని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు.