India: ఒకేసారి 2 లక్షల మందితో మాట్లాడనున్న కోవింద్... వినూత్న ప్రయోగానికి ఏపీ రెడీ!
- 27న ఏపీకి రానున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
- అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లో ఏర్పాట్లు
ఈనెల 27వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అమరావతికి రానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో వినూత్న ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రాష్ట్రపతి షెడ్యూల్ లో సచివాలయాన్ని, అత్యాధునిక ఆర్ టీజీఎస్ కేంద్రాన్ని చూపించాలని షెడ్యూల్ లో చేర్చిన ఏపీ ప్రభుత్వం, ఆయనతో అక్కడి నుంచి ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రపతి తనకు నచ్చిన గ్రామం, పట్టణం నుంచి ఎదురుగా స్క్రీన్ పై కనిపిస్తున్న వారితో మాట్లాడేలా ఏర్పాట్లు చేసిన చంద్రబాబు సర్కారు, ఒకేసారి 2 లక్షల మందిని ఆయనకు అందుబాటులోకి తేనుంది. ఇందుకు భారీ జెయింట్ స్క్రీన్ లను ఏర్పాటు చేయనుంది. ఏపీలోని అన్ని పట్టణాలు, మండలాలను ఒకేసారి చూపిస్తూ జరగనున్న ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
సచివాలయంలోని సెంట్రల్ మీటింగ్ హాల్ వేదికగా, ఈ కార్యక్రమం సాగనుందని సమాచారం. అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం పరిపాలనను ఎంత సులభతరం చేసిందన్న విషయంతో పాటు, రాజధాని నుంచి ప్రతి గ్రామానికీ కనెక్టివిటీని ఎలా రూపొందించుకున్నామన్న విషయాన్ని కోవింద్ కు తెలియజెప్పడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగనుందని అధికారులు వెల్లడించారు.