Hyderabad: హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తల విధ్వంసం!
- ట్యాంక్ బండ్ మెరుపు ముట్టడికి మంద కృష్ణ పిలుపు
- తరలివచ్చిన వేలాదిమంది
- పోలీసులపై కార్యకర్తల దాడి
- ఇరు వర్గాల మధ్య తోపులాట
- బాష్పగోళాలు ప్రయోగించిన పోలీసులు
ఎస్సీ వర్గీకరణను కోరుతూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చేపట్టిన మెరుపు ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ట్యాంక్‌బండ్ ముట్టడికి ఇచ్చిన పిలుపులో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సికింద్రాబాద్ నుంచి వందలాదిమంది కార్యకర్తలు ట్యాంక్ బండ్ వైపు తరలిరావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కార్యకర్తలు ట్యాంక్‌బండ్ వైపు కదులుతూ మార్గమధ్యంలో తెలుగు మహాసభల హోర్డింగులు, బ్యానర్లను ధ్వంసం చేశారు. పోలీసుల పెట్రోలింగ్ బైకులకు నిప్పు పెట్టారు. వారిపై దాడి చేశారు.
కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. లారీలు, ఇతర వాహనాలు, ముళ్ల కంచెలను అడ్డుగా పెట్టి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ప్యారడైజ్ వద్ద పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ క్రమంలో మంద కృష్ణ సహా ఐదుగురు సొమ్మసిల్లి పడిపోయారు. ఆందోళనకారుల ర్యాలీ రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న తర్వాత పోలీసులు మంద కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు.