gujarat assembly elections: గుజరాత్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలు.. స్పందించిన ఎన్నికల సంఘం
- ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ హార్దిక్ పటేల్ ఆరోపణ
- ఈవీఎంలు కూడా హ్యాక్ అవుతాయన్న పటిదార్ ఉద్యమ నేత
- ఆరోపణలను ఖండించిన ఎన్నికల సంఘం
గుజరాత్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఉత్కంఠభరిత ట్రెండ్స్ వెలువడుతున్న వేళ... ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఎన్నికల సంఘం స్పందించింది. ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయంటూ వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. పటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ ఈ ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘం ప్రధానాధికారి అచల్ కుమార్ జోతి కాసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చి... ఈవీఎంలు ట్యాంపర్ అయ్యే అవకాశమే లేదని స్పష్టం చేశారు. గతంలో మీడియా సమక్షంలోనే ఎన్నికల సంఘం వీటిపై ప్రయోగపూర్వకంగా వివరణ ఇచ్చుకుందని చెప్పారు. ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. గుజరాత్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి బీబీ స్వాయిన్ కూడా ఈ ఆరోపణలను ఖండించారు. ఏటీఎంలు హ్యాకింగ్ కు గురవుతున్నప్పుడు.. ఈవీఎంలు కూడా హ్యాకింగ్ కు గురవుతాయంటూ హార్దిక్ పటేల్ తాజాగా వ్యాఖ్యానించారు.