google: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్... దిగాల్సిన స్టాప్‌ను గుర్తుచేసే సదుపాయం!
- నెలాఖరులోగా అందుబాటులోకి
- ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ లభ్యం
- బ్లాగ్‌లో పేర్కొన్న గూగుల్ మ్యాప్స్
రైల్లోనో, బస్సులోనో వెళ్తున్నపుడు తాము దిగాల్సిన స్టాప్‌ని మర్చిపోయే వాళ్లకు ఉపయోగపడే ఓ సరికొత్త ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా దిగాల్సిన స్టాప్ రావడానికి ముందే ఓ నోటిఫికేషన్ పంపిస్తుంది. ఈ ఫీచర్‌ను 'స్టెప్ బై స్టెప్ డైరెక్షన్స్' అని గూగుల్ మ్యాప్స్ పేర్కొంది. నెలాఖరులోగా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు గూగుల్‌లో బైక్ మీద గానీ, కారులో గానీ, కాలినడకన గానీ వెళ్లినపుడు పట్టే సమయం, దారి గురించి తెలిసేది. కానీ ప్రభుత్వ రవాణా లేదా ఇతర రవాణాలో ప్రయాణించే వారి కోసం ఎలాంటి ఫీచర్ అందుబాటు లేదు. కానీ ఈ స్టెప్ బై స్టెప్ డైరెక్షన్స్ ద్వారా ప్రయాణంలో పాటలు వినడం, వేరే ఏదైనా పనిలో నిమగ్నమైన వారికి తాము దిగాల్సిన స్టాప్‌ని గుర్తుచేసే అవకాశం కలుగుతుందని గూగుల్ మ్యాప్స్ టెక్నికల్ హెడ్ సుచేత కులకర్ణి బ్లాగులో పేర్కొన్నారు.
ఈ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవడం కోసం గూగుల్ మ్యాప్స్‌లో లాగిన్ అయ్యి, గమ్యస్థానం వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత ప్రయాణించే దారిని, దిగాల్సిన స్టాప్‌ను ఎంచుకుని, ట్రాకింగ్‌ని ఆన్ చేయాలి. ఇక అప్పటి నుంచి ప్రయాణంలో ఎక్కడ ఉన్నది, ఎంతదూరం ప్రయాణించిందనే వివరాలతో పాటు దిగాల్సిన స్టాప్ ఇంకా ఎంతదూరం ఉందనే వివరాలను కూడా చూపిస్తుంది. ఇక స్టాప్ దగ్గరికి రావడానికి రెండు స్టాప్‌ల ముందు నుంచే నోటిఫికేషన్లు ఇస్తుంది. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకి కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.