Chiranjeevi: కేటీఆర్ ఆ మాట అనగానే నా మనసు చివుక్కుమంది!: మెగాస్టార్ చిరంజీవి

  • తెలుగు మహాసభలకు హాజరైన చిరంజీవి
  • సభలకు ఆహ్వానించేందుకు ఇంటికొచ్చిన కేటీఆర్‌తో జరిగిన సంభాషణను గుర్తు చేసుకున్న చిరు
  • తెలుగు భాషను బతికించుకుందామని పిలుపు

ప్రపంచ తెలుగు మహాసభలకు సోమవారం మెగాస్టార్ చిరంజీవి సహా టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పరిశ్రమ పెద్దలను తెలంగాణ ప్రభుత్వం తరపున సన్మానించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తెలుగును మాతృభాష అనడానికి గల కారణాన్ని వివరించారు. ఆలోచనలని, కలలని మనం ఏ భాషలో అయితే కంటామో అదే మన మాతృభాష అని చెప్పారు. తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు ముఖ్యమంత్రిని ప్రశంసించారు.

ఈ సందర్భంగా తెలుగు మహాసభలకు ఆహ్వానించేందుకు తన ఇంటికి వచ్చిన మంత్రి కేటీఆర్‌తో జరిగిన సంభాషణ గురించి వివరించారు. తెలుగు మహాసభలకు తనను ఆహ్వానించేందుకు ఇంటికి వచ్చారని, ఆయనకు అవార్డు వచ్చిన విషయం తెలిసి ఇంగ్లిష్‌లో అభినందించానని అన్నారు. అయితే వెంటనే స్పందించిన కేటీఆర్.. ‘అన్నా.. మనం తెలుగు వాళ్లం. స్వచ్ఛమైన తెలుగు కార్యక్రమానికి పిలవడానికి వచ్చా.. తెలుగులోనే మాట్లాడుకుంటే బాగుంటుంది కదా’’ అన్నారని, దీంతో నిజమే కదా అనిపించి మనసు చివుక్కుమన్నదని చిరంజీవి వివరించారు.  తెలుగు వాళ్లం కలిసినప్పుడు చక్కటి తెలుగులో కాకుండా ఆంగ్లభాష ఎందుకని అనిపించిందని, ఆ వెంటనే కేటీఆర్‌కు సారీ చెప్పేశానని తెలిపారు. దానికి కేటీఆర్ ‘‘లేదన్నా.. జస్ట్ జోకింగ్’’ అని అన్నారని, ఆయన తమాషాగా అన్నా నాలో మాత్రం ఆ భావన కలిగిందని చిరంజీవి వివరించారు.

తాను కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నప్పుడు చాలామందిని చూశానని, అధికారులు హిందీలో మాట్లాడుకుంటారని, తమిళులు తమిళంలో మాట్లాడుకుంటారని, ఇద్దరు తెలుగువారు కలిసినప్పుడు మాత్రం ఇంగ్లిష్‌లో మాట్లాడుకుంటారని చిరంజీవి అన్నారు. ఇప్పటికైనా భేషజాలు వీడి తెలుగులో మాట్లాడి తెలుగును బతికించుకుందామని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News