Narendra Modi: కన్నడ యుద్ధానికి మోదీ-రాహుల్ రెడీ!
- కర్ణాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు
- ఇప్పటి నుంచే సిద్ధమవుతున్న బీజేపీ-కాంగ్రెస్
- మోదీ మ్యాజిక్ ఇక్కడ పనిచేయదన్న సిద్ధరామయ్య
- వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటామంటున్న యడ్యూరప్ప
గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌లలో పోరు ముగిసింది. ఇప్పుడు ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీల దృష్టి కన్నడ రాష్ట్రంపై పడింది. వచ్చే ఏడాది ఏప్రిల్-మేలో కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా అధికార, ప్రతిపక్షాల చూపు ఇప్పుడు ఇటు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా దానిని కూడా తమ వశం చేసుకుని కాంగ్రెస్ ‘చేతి’ నుంచి మరో రాష్ట్రాన్ని లాగేసుకోవాలని బీజేపీ ఇప్పటి నుంచే ప్లాన్లు వేస్తోంది.
కర్ణాటకలో మొత్తం 224 స్థానాలుండగా కాంగ్రెస్ చేతిలో 127 స్థానాలున్నాయి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఫలితాలు ఇచ్చిన ఊపుతో ఉన్న బీజేపీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ తప్పదని ధీమా వ్యక్తం చేస్తోంది.
అభివృద్ధి అజెండాతో కాంగ్రెస్, హిందూత్వ కార్డుతో బీజేపీ కన్నడ నాట పోటీకి సిద్ధమవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో లాగా మోదీ మ్యాజిక్ ఇక్కడ పనిచేయదని సీఎం సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. సిద్ధరామయ్య ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప చెబుతున్నారు. మోదీ అభివృద్ధి మంత్రకు గుజరాత్ ప్రజలు పట్టం కట్టారని, కర్ణాటక ప్రజలు కూడా బీజేపీకే పట్టం కడతారని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు.