krishnamraju: అలా చేసినందుకు మా నాన్నగారికి బాగా కోపం వచ్చేసింది .. నన్ను బాగా కొట్టేశారు!: కృష్ణంరాజు
- ఇంటికి వచ్చిన వ్యక్తికి సరిగ్గా సమాధానం చెప్పలేదు
- నేను విసుక్కోవడం మా నాన్నగారు విన్నారు
- అంతే.. ఆయన ఆవేశం కట్టలు తెంచుకుంది
సాంఘిక చిత్రాలతో పాటు .. చారిత్రక చిత్రాల్లోను నటించి మెప్పించిన కృష్ణంరాజు, తన జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన ఒకటి ఉందంటూ చెప్పుకొచ్చారు. " ఓ రోజున నేను హాల్లోని టేబుల్ పై కాలు మీద కాలేసుకుని పడుకుని వున్నాను. నా పాదాల వైపు గుమ్మం వుంది .. తలవైపు గుమ్మం వుంది. అప్పుడు ఒకాయన ఎదురుగా వున్న గుమ్మంలో నుంచి వచ్చి, "నారాయణ మూర్తి రాజు గారు ఉన్నారా?" అంటూ మా నాన్నను గురించి అడిగారు.
"లేరయ్యా" అన్నాను. "అది కాదు బాబూ, నేను ఎక్కడి నుంచి వచ్చానంటే .. " అంటూ ఆయన ఏదో చెప్పబోతుంటే, "చెబుతున్నాను గదా లేరని .. వెళ్లు .. " అంటూ విసుక్కున్నాను. సరిగ్గా అప్పుడు మా నాన్నగారు నా మాటలు వింటూనే .. లోపలి నుంచి వచ్చారు. నేను కంగారుపడుతూ లేవగానే నన్ను పట్టుకుని కొట్టడం మొదలుపెట్టారు. "ఇంటికి వచ్చిన వాళ్లని గౌరవించవలసిందిపోయి .. అగౌరవ పరుస్తావా?" అంటూ మాములుగా కొట్టలేదు. మా అమ్మమ్మ గారు వచ్చి అడ్డుపడే వరకూ ఆయన ఆగలేదు" అంటూ చెప్పుకొచ్చారు.