chota shakeel: దావూద్ కుడి భుజం ఛోటా షకీల్ ప్రాణాలతో లేడా? ఐఎస్ఐ హతమార్చిందా?
- చోటా షకీల్ మరణించాడంటూ పలు రిపోర్ట్ లు
- ఐఎస్ఐ అంతం చేసిందన్న ఓ రిపోర్ట్
- షకీల్ రెండో భార్య లాహోర్ కు తరలింపు
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు, అతని ప్రధాన అనుచరుడు ఛోటా షకీల్ కు మధ్య విభేదాలు తలెత్తాయనే వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దావూద్ కు దూరంగా కరాచీలో షకీల్ ఉంటున్నాడని, ప్రత్యేకంగా సొంత కుంపటి ఏర్పాటు చేసుకుంటున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సంచలన వార్త వైరల్ అవుతోంది. చోటా షకీల్ ప్రాణాలతో లేడనేదే ఆ వార్త!
వాస్తవానికి షకీల్ మరణానికి సంబంధించి పలు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 2017 జనవరి 6న షకీల్ చనిపోయాడని ఓ రిపోర్ట్ పేర్కొంది. మరో రిపోర్ట్ ప్రకారం... షకీల్ హార్ట్ అటాక్ కు గురయ్యాడు. వెంటనే అతన్ని రావల్పిండిలోని కంబైన్డ్ మెడికల్ హాస్పిటల్ కు విమానంలో తరలించారు... అక్కడే అతడు చనిపోయాడు.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ షకీల్ ను హతమార్చిందని మరో రిపోర్ట్ పక్కాగా చెబుతోంది. ఈ రిపోర్ట్ ప్రకారం దావూద్, షకీల్ కు మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఐఎస్ఐ ప్రయత్నించింది. అయినా చోటా షకీల్ వెనక్కి తగ్గలేదు. షకీల్ సొంత కుంపటి పెట్టుకుంటే... భారత్ కు వ్యతిరేకంగా తాము చేసే పనులకు తీవ్ర విఘాతాలు కలుగుతాయని ఐఎస్ఐ భయపడింది. దీంతో, షకీల్ అడ్డు తొలగించింది. రెండు రోజుల తర్వాత సీ-130 ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లో షకీల్ శవాన్ని కరాచీకి తరలించి, డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ శ్మశానవాటికలో అత్యంత రహస్యంగా ఖననం చేశారు.
షకీల్ మరణవార్తను రెండు రోజుల అనంతరం దావూద్ ఇబ్రహీంకు ఐఎస్ఐ తెలిపింది. ఈ విషయం డీ గ్యాంగ్ లోని అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. మరోవైపు, షకీల్ రెండో భార్యతో పాటు ఇతర కుటుంబ సభ్యులను ప్రస్తుతం ఉంటున్న నివాసం నుంచి లాహార్ లోని సురక్షితమైన నివాసానికి తరలించారు.
అయితే, ఈ వార్తలను ఢిల్లీలోని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ కానీ, ముంబై పోలీసులు కానీ ధ్రువీకరించలేదు. ఇదే సమయంలో ఖండించలేదు కూడా.
మరోవైపు ఇదే సమయంలో ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ అవుతోంది. డీ గ్యాంగ్ లోని బిలాల్ అనే వ్యక్తికి, ముంబైలో నివాసం ఉండే షకీల్ బంధువుకు మధ్య జరిగిన సంభాషణలో... షకీల్ మరణానికి సంబంధించిన సంభాషణ ఈ క్లిప్ లో ఉంది. అయితే, ఈ క్లిప్ నిజమైనదేనా అనే విషయంలో కూడా సందేహాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ షకీల్ ను చంపేసి ఉంటారనే ఎక్కువ మంది భావిస్తున్నారు.