India: దుమ్ము దులిపేసిన టీమిండియా బ్యాట్స్‌మెన్.. టీ20లో అతి భారీ స్కోరు!
- నిర్ణీత ఓవర్లలో టీమిండియా స్కోరు 260/5
- రోహిత్ శర్మ 118 (43 బంతుల్లో) పరుగులు
- లోకేశ్ రాహుల్ 49 బంతుల్లో 89 పరుగులు
- టీ20 చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు
మధ్యప్రదేశ్, ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతోన్న టీ20 లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా దుమ్ముదులిపేసింది. భారత బ్యాట్స్‌మెన్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడుతూ శ్రీలంక బౌలర్లను ఊచకోత కోసేశారు. 35 బంతుల్లో మెరుపు వేగంతో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో రోహిత్ శర్మ 101 పరుగులు చేసి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. ఆ తరువాత కూడా ధాటిగా ఆడడానికి ప్రయత్నించిన రోహిత్ శర్మ.. 118 పరుగుల (43 బంతుల్లో) వ్యక్తిగత స్కోరు వద్ద చమీరా బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి ధోనీ వచ్చాడు.
కొద్ది సేపటికే మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. లోకేశ్ రాహుల్ అదే ఆటతీరును కొనసాగిస్తూ 49 బంతుల్లో 89 పరుగులు చేసి నువాన్ ప్రదీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా 3 బంతులు ఆడి 10 పరుగులు బాది.. ప్రదీప్ బౌలింగ్‌లోనే క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. క్రీజులో రాణించిన ధోనీ 21 బంతుల్లో 28 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మనీశ్ పాండే 1 పరుగు, దినేశ్ కార్తీక్ 5 పరుగులు చేశారు.
టీమిండియాకి ఎక్స్ ట్రాల రూపంలో 9 పరుగులు వచ్చాయి. దీంతో టీమిండియా 20 ఓవర్లకి 260 పరుగులు చేసింది. టీ20 చరిత్రలో భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు. టీ20ల్లో రెండో అత్యధిక స్కోరును భారత్ సమం చేసింది. శ్రీలంక బౌలర్లలో ప్రదీప్, పెరీరాలకు రెండేసి చొప్పున వికెట్లు లభించగా, చమీరాకి ఒక వికెట్ దక్కింది.