maoist party: మావోయిస్టులకు ఎదురుదెబ్బ.. పోలీసులకు లొంగిపోయిన కీలక నేత జంపన్న, అతని భార్య రజిత!
- పోలీసులకు లొంగిపోయిన జంపన్న, రజిత
- కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న జంపన్న
- వీరిద్దరిపై రూ. 45 లక్షల పోలీసు రివార్డు
మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు జీనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న పోలీసులకు లొంగిపోయారు. తన భార్య రజితతో కలసి పోరాట జీవితానికి ముగింపు పలికారు. జంపన్నపై రూ. 25 లక్షలు, రజితపై రూ. 20 లక్షల పోలీసు రివార్డు ఉంది. 40 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో జంపన్న ఎంతో క్రియాశీలంగా పని చేశారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన జంపన్న 40 ఏళ్ల క్రితం అప్పటి పీపుల్స్ వార్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. తన పోరాటంలో భాగంలో ఎన్నో సంఘటనల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. తద్వారా పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా మారారు. మావోయిస్టు పార్టీకి సంబంధించిన పలు యాక్షన్ ప్లాన్లలో జంపన్నది కీలక పాత్ర.
తోటి మావోయిస్టు సభ్యురాలు రజితను జంపన్న వివాహం చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదువుతూ పీపుల్స్ వార్ పట్ల రజిత ఆకర్షితులయ్యారు. అనంతరం పార్టీలో చేరారు. అయితే, వీరిద్దరూ లొంగిపోయినట్టు పోలీసులు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. రెండు, మూడు రోజుల్లో ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, ఈ వార్తను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.