Pawan Kalyan: పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై నన్నపనేని రాజకుమారి అభ్యంతరం!
- పెందుర్తిలో ఓ దళిత మహిళ చీరను చింపిన ఘటనపై పవన్ మండిపాటు
- ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ వ్యాఖ్యలు
- చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదు- నన్నపనేని
- ఉపేక్షించబోము.. నిందితులను శిక్షించి తీరుతాం
విశాఖపట్టణం, పెందుర్తిలో ఓ దళిత మహిళ చీరను చింపి కొందరు అవమానించిన విషయం తెలిసిందే. టీడీపీ నేతలే ఆమెను అవమానించారని, రిపోర్టులు చెబుతున్నాయని, ఈ ఘటన తనను కలచివేసిందని పవన్ కల్యాణ్ ట్వీట్ కూడా చేశారు. ఇంత జరిగినా ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందించారు. విశాఖపట్నం ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని అనడం సరికాదని అన్నారు.
మహిళపై దాడి చేసిన ఘటన తెలిసిన వెంటనే అక్కడి అధికారులతో తాను స్వయంగా మాట్లాడానని నన్నపనేని తెలిపారు. తన ఆరోగ్యం సహకరించపోయినప్పటికీ మీడియా ముందుకు వచ్చానని చెప్పారు. మహిళలకు న్యాయం చేయడానికే చంద్రబాబు నాయుడు తనకు ఈ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. నిందితులు ఎవ్వరయినా సరే తాము ఉపేక్షించబోమని, శిక్షించి తీరుతామని చెప్పారు. బాధితురాలికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.