Ravichandran Ashwin: వన్డే క్రికెట్లో అశ్విన్, జడేజా శకం ముగిసినట్టేనా?
- వరుసగా మొండిచేయి చూపిస్తున్న సెలక్టర్లు
- ఆరు నెలలుగా జట్టుకు దూరమైన అశ్విన్, జడేజా
- వారిద్దరి స్థానలను భర్తీ చేసిన కుల్దీప్ యాదవ్, చాహల్
- వారు జట్టులోకి రావడం కష్టమేనంటున్న క్రీడా పండితులు
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాల వన్డే శకం ఇక ముగిసినట్టేనా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అశ్విన్ ఈ ఏడాది జూన్‌లో చివరిసారి వన్డే మ్యాచ్ ఆడగా, జడేజా జూలైలో ఆడాడు. విండీస్ టూర్లో వీరు చివరిసారి ఆడగా, టీ20ల్లో ఆడడం కూడా అదే చివరిసారి.
ఆ తర్వాత భారత్ శ్రీలంక, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో ఆడింది. అయితే వీరిద్దరికి మాత్రం సెలక్టర్లు ముండిచేయి చూపారు. ‘విశ్రాంతి’ పేరుతో పక్కనపెట్టారు. ఆ ‘విశ్రాంతి’ పెరుగుతూనే పోతోంది తప్ప మోక్షం కలగడం లేదు. తాజాగా దక్షిణాఫ్రికా టూర్‌కు వన్డే జట్టును ప్రకటించిన సెలక్టర్లు వీరికి మాత్రం మొండిచేయి చూపారు. వారి స్థానాలను తాజా సంచలనం కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్సర్ పటేల్‌లతో భర్తీ చేస్తున్నారు. వారు బ్రహ్మాండంగా రాణిస్తూ అశ్విన్, జడేజాల పునరాగమనాన్ని సంక్లిష్టం చేస్తున్నారు.
కుల్దీప్ యాదవ్, చాహల్‌లు చాలా బాగా రాణిస్తున్నారని, జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించగా, శ్రీలంకతో జరిగిన రెండో టీ20ని మలుపుతిప్పి భారత్‌కు విజయాన్ని అందించేది వారిద్దరేనని తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశానికెత్తేశాడు. దీంతో ఇక అశ్విన్, జడేజాల రాక కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
అశ్విన్, జడేజాలు ఆరేడేళ్లుగా ఆడుతున్నారని పేర్కొన్న కోహ్లీ.. చాహల్, కుల్దీప్లు చక్కగా రాణిస్తున్నారని పేర్కొన్నాడు. ప్రజలు ఎవరు ఆడుతున్నారన్న విషయాన్ని చూడరని, విజయాలను లెక్కిస్తారని, తాము ఇప్పుడు అదే బాటలో ఉన్నామని నర్మగర్భంగా చెప్పాడు.
అశ్విన్, జడేజాలు ఇంకా పోటీలోనే ఉన్నారని, అయితే తాము ప్రతీ ఫార్మాట్లోనూ ఆడగల క్రియేటివ్ స్పెషలిస్టుల కోసం వెతుకుతున్నామని సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేర్కొన్నాడు. అయితే భవిష్యత్తులో వారిని ఎంపిక చేసే విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. దీంతో వీళ్లందరి వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే అశ్విన్, జడేజాల వన్డే క్రికెట్ శకం ముగిసినట్టేనని క్రీడా పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.