Rohit Sharma: మరోసారి క్రికెట్ ఆడితే జైల్లో పెడతానని అప్పట్లో ఓ పోలీసు అధికారి నన్ను బెదిరించాడు!: రోహిత్ శర్మ
- వీధుల్లో క్రికెట్ ఆడుతూ బోల్డన్ని కిటికీ అద్దాలు పగలగొట్టా
- పోలీసు కేసు కూడా నమోదైంది
- ‘బ్రేక్ ఫాస్ట్ విత్ చాంపియన్స్’లో పలు విషయాలను గుర్తు చేసుకున్న ‘హిట్ మ్యాన్’
క్రికెట్ ఆడుతున్నందుకు జైల్లో వేస్తామని ముంబై పోలీసులు ఒకసారి తనను బెదిరించారని టీమిండియా ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ వెల్లడించాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి ఫాస్టెస్ట్ రికార్డును సమం చేసిన రోహిత్ గౌరవ్ కపూర్ షో ‘బ్రేక్‌ఫాస్ట్ విత్ చాంపియన్స్’లో మాట్లాడుతూ పలు విషయాలను గుర్తు చేసుకున్నాడు.
తన కుటుంబం మొత్తానికి క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని రోహిత్ పేర్కొన్నాడు. రోజులో కనీసం 16 గంటలు క్రికెట్‌ను చూసే వారమని పేర్కొన్నాడు. తన బాబాయిలు, పిన్నిలు అందరూ చదువుకునేటప్పుడు క్రికెట్ ఆడేవారని తెలిపాడు. తాను ఇంటి బయట క్రికెట్ ఆడుతుంటే తన అంకుల్ గమనిస్తుండేవారని, తనను గొప్ప క్రికెటర్‌గా చూడాలని అనుకున్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు.
వీధుల్లో క్రికెట్ ఆడుతూ ఎన్నో ఇళ్ల కిటికీల అద్దాలు బద్దలుగొట్టానని, ఈ విషయంలో పోలీసులు కేసు కూడా నమోదు చేశారని వివరించాడు. మరోసారి క్రికెట్ ఆడి అద్దాలు బద్దలుగొడితే జైలుకు పంపిస్తానని ఓ పోలీసు అధికారి తనను హెచ్చరించి వెళ్లాడని ‘డబుల్’ సెంచరీ వీరుడు గుర్తు చేసుకున్నాడు. తొలుత ముగ్గురం, నలుగురం కలిసి క్రికెట్ ఆడుకునే వారమని, తర్వాత గ్రౌండ్‌కు వెళ్లి ఆడడం మొదలుపెట్టామని వివరించాడు.