TTV Dinakaran: ఆధిక్యంలో దినకరన్... ఎవ్వరూ ఊహించని తీర్పు ఇవ్వబోతున్న ఆర్కే నగర్ ఓటర్లు!
- జయకు వారసుడిగా నిలిచే దిశగా సాగుతున్న దినకరన్
- 1200 ఓట్లకు పైగా మెజారిటీ
- విశ్లేషకుల అంచనాలు తలకిందులు
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగర పరిధిలోని ఆర్కే నగర్ నియోజకవర్గ ఓటర్లు ఎవ్వరూ ఊహించని తీర్పు ఇవ్వబోతున్నారు. జయలలిత మరణంతో ఖాళీగా ఏర్పడిన స్థానానికి వారసుడిగా శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ను ఎంచుకున్నట్టుగా కౌంటింగ్ ఫలితాల సరళి చెబుతోంది.
రెండో రౌండ్ ముగిసేసరికి దినకరన్ కు 1,891 ఓట్లు, అన్నాడీఎంకే తరఫున బరిలోకి దిగిన మధుసూదనన్ కు 646 ఓట్లు, డీఎంకే తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 360 ఓట్లు వచ్చాయి. వాస్తవానికి ఈ ఎన్నికల్లో దినకరన్ ను ఓటర్లు తిరస్కరిస్తారని, ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకే మధ్య సాగుతుందని రాజకీయ విశ్లేషకులు వేసిన ముందస్తు అంచనాలు తలకిందులు అయ్యేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే దినకరన్ వర్గం కౌంటింగ్ కేంద్రం వద్ద సందడి చేస్తుండటం కనిపిస్తోంది. గెలిచేది తామేనని, భవిష్యత్ సీఎం దినకరన్ అని వారు నినాదాలు చేస్తున్నారు.