Madhurai: ఇక మూడే నెలలు... వెయిట్ అండ్ సీ: టీటీవీ దినకరన్
- మధురై నుంచి చెన్నైకి బయలుదేరిన దినకరన్
- ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన శశికళ వర్గం నేత
- గుర్తు కన్నా అభ్యర్థే ముఖ్యమని ప్రజలు చెప్పారు
- మూడు నెలల్లో పళని ప్రభుత్వం కుప్పకూలుతుందని వ్యాఖ్య
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని తేలిపోయిన తరువాత చెన్నై చేరుకునేందుకు మధురై విమానాశ్రయానికి వచ్చిన టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో మూడు నెలల్లో పళనిస్వామి ప్రభుత్వం పడిపోనున్నదని, రాష్ట్ర రాజకీయాలు సమూలంగా మారిపోనున్నాయని అన్నారు. జరగబోయేదాన్ని గురించి తాను చెప్పడం కంటే, వేచి చూస్తే బాగుంటుందని చెప్పిన ఆయన, అమ్మ జయలలిత వారసులు ఎవరన్న విషయం ఇప్పటికే ప్రజలు తేల్చేశారని వ్యాఖ్యానించారు.
ఆర్కే నగర్ ఓటర్ల తీర్పే యావత్ తమిళ ప్రజలందరి తీర్పని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తును చూసి ఎవరూ ఓట్లు వేయలేదని, అభ్యర్థిని మాత్రమే చూశారని అన్నారు. తనకు ఎంజీఆర్, జయలలిత ఆశీస్సులు ఉన్నాయని, అందువల్లే గెలుస్తున్నానని చెప్పారు. కాగా, ఐదు రౌండ్ల తరువాత దినకరన్ కు 20,298 ఓట్లు రాగా, అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్ కు 9,672, డీఎంకే అభ్యర్థి గణేశన్ కు 5,091 ఓట్లు, నామ్ తమిళార్ పార్టీకి 737, బీజేపీకి 334 ఓట్లు లభించాయి. నోటాకు 791 ఓట్లు రావడం గమనార్హం.