RK Nagar: కిం కర్తవ్యం... ఈపీఎస్, ఓపీఎస్ అత్యవసర సమావేశం!
- ఆర్కే నగర్ లో ఘోర పరాజయం
- ఆ వెంటనే స్వరం మార్చిన కొందరు నేతలు
- ఉదయం 11 గంటలకు సమావేశం
చెన్నై పరిధిలోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత, పలువురు అన్నాడీఎంకే మంత్రులు, ఎమ్మెల్యేల స్వరం టీటీవీ దినకరన్ కు అనుకూలంగా మారడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం ఈ ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల సమయంలో జరిగే సమావేశానికి రావాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సమాచారం అందింది.
ఆర్కే నగర్ లో ఓటమికి దారితీసిన కారణాలపై విశ్లేషణ జరిపేందుకే సమావేశం అని చెబుతున్నప్పటికీ, ఫలితం తరువాత మారిన పరిస్థితులను సమీక్షించేందుకే సమావేశం జరుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమ చేతిలోని ఎమ్మెల్యేలు, నేతలు దినకరన్ వైపు పోకుండా చూసుకోవడమే లక్ష్యంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు మంతనాలు సాగించనున్నట్టు తెలుస్తోంది.