ravi sashtri: వీ డోంట్ కేర్: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి
- టీ20ల్లో కుర్రాళ్లకు అవకాశం కల్పిస్తున్నాం
- 2019లో బెర్త్ ఖరారు చేసుకునేందుకు ఇది వారికొక అవకాశం
- దక్షిణాఫ్రికా టూర్ ఛాలెంజింగ్ గా ఉంటుంది
తమ ఆటగాళ్లు టీ20 క్రికెట్ ను లెక్క చేయడం లేదని... గెలుస్తామా? లేక ఓడిపోతామా? అనే ఆలోచన కూడా చేయరని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే 'వీ డోంట్ కేర్' అని తెలిపాడు. శ్రీలంకతో జరిగిన మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ శాస్త్రి ఈ వ్యాఖ్యలు చేశాడు. టీ20 గెలుపు, ఓటములను తాము పట్టించుకోవడం లేదని... అయితే, ఈ ఫార్మాట్ లో యువకులకు అవకాశం ఇవ్వడం జరుగుతోందని... 2019 ప్రపంచకప్ లో స్థానం సంపాదించుకునేందుకు ఇది వారికి అవకాశం కల్పిస్తుందని చెప్పాడు.
ఉనద్కత్ గత ఐదారేళ్లుగా ఆడుతున్నా... ఇప్పుడు రాటుదేలాడని చెప్పాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా అద్భుతంగా ఎదిగిన క్రికెటర్ కేఎల్ రాహుల్ అంటూ కితాబిచ్చాడు. రాహుల్ అన్ని షాట్స్ ను ఆడగలడని చెప్పాడు. రానున్న దక్షిణాఫ్రికా టూర్ ఛాలెంజింగ్ గా ఉంటుందని... అయితే ప్రపంచంలో ఏ దేశాన్నైనా ఎదుర్కోగలిగే సత్తా మన టీమ్ కు ఉందని అన్నాడు.