President of India: రంగారెడ్డి జిల్లాలో గవర్నర్‌తో కలిసి మొక్క నాటిన రాష్ట్రపతి!
- శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాదులో బస చేస్తోన్న రామ్‌నాథ్ కోవింద్
- రామచంద్ర మిషన్‌ను సందర్శించిన రాష్ట్రపతి
- సుమారు గంట పాటు ధ్యాన మందిరంలో
శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాదులో బస చేస్తోన్న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ రోజు హెలికాప్టర్ లో రాష్ట్రపతి నిలయం, బొల్లారం నుండి బయలుదేరి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరు గ్రామంలోని రామచంద్ర మిషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయనకు హైదరాబాద్ కలెక్టర్ యోగితా రానా, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్య తో పాటు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు.
అక్కడి నుండి రాష్ట్రపతి రామచంద్ర మిషన్ వారి కన్హా శాంతి వనాన్ని సందర్శించారు. రామచంద్ర మిషన్ మాస్టర్ కమలేష్ పాటిల్ తో పాటు సుమారు గంట పాటు ధ్యాన మందిరంలో గడిపారు. శాంతి వనంలో ఒక నాగవల్లి మొక్కను నాటి రాష్ట్రపతి నిలయానికి బయలుదేరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్ కూడా పాల్గొన్నారు.