Andhra Pradesh: కనెక్షన్ ఒకటే.. సేవలు మాత్రం మూడు.. ఏపీలో బృహత్తర ప్రాజెక్టు.. రేపు జాతికి అంకితం!
- ఒక్క కనెక్షన్‌తో ఫోన్, టీవీ, ఇంటర్నెట్ సదుపాయం
- ప్రస్తుతం లక్ష గృహాలకు కనెక్షన్లు
- మార్చినాటికి పది లక్షల ఇళ్లకు ఇవ్వాలని లక్ష్యం
- దశలవారీగా 1.45 కోట్ల కుటుంబాలకు విస్తరణ
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు ఏపీలో బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. రాష్ట్రాన్ని ‘డిజిటల్ ఏపీ’గా తీర్చిదిద్దే ఆ ప్రాజెక్టు పేరు ‘ఫైబర్ గ్రిడ్’. ఇందులో భాగంగా ప్రజలకు ఒక్క కనెక్షన్‌తో మూడు సేవలు లభిస్తాయి. ప్రతి ఇంటికీ ఇంటర్నెట్, టెలిఫోన్, 250 వరకు టీవీ చానళ్లను ఈ కనెక్షన్‌తో పొందవచ్చు. అపరిమిత కాలింగ్ సదుపాయం, వీడియో కాలింగ్, కాన్ఫరెన్స్ కూడా చేసుకోవచ్చు. అత్యంత చవక ధర మరో విషయం. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టును బుధవారం రాష్ట్రపతి ప్రారంభించనున్నారు.
ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,03,613 గృహాలకు కనెక్షన్లు ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలనేది లక్ష్యం. తొలుత ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆటంకాలు ఎదురయ్యాయి. భూగర్భంలో హైస్పీడ్ ఫైబర్ ఆప్టిక్ లైన్లు వేయడానికి రూ. 5 వేల కోట్ల వరకు ఖర్చవుతుందని తేలడంతో కరెంటు స్తంభాల ఆధారంగా 23,800 కిలోమీటర్ల మేర రూ.330 కోట్ల ఖర్చుతో ఓఎఫ్సీ లైన్లు వేశారు. టెలిఫోన్, మొబైల్ సేవలు అస్సలు అందుబాటులో లేని 3,060 గ్రామాల్లో 60 గ్రామాలకు కూడా ఈ లైన్లు వేశారు. ఈ గ్రామాల్లో రేపటి నుంచి ఫోన్లు రింగవనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 100 గ్రామాల్లోని అన్ని ఇళ్లకు ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. లైన్లు వేయలేని చోట ఫ్రీ స్పేస్ ఆప్టిక్ కనెక్షన్ (ఎఫ్ఎస్సీ) పరిజ్ఞానంతో కనెక్షన్లు ఇచ్చారు. ఫలితంగా 20 కిలోమీటర్ల పరిధిలో వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. రాష్ట్రంలోని 1.45 కోట్ల కుటుంబాలకు దశలవారీగా ఫైబర్ నెట్ కనెక్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా, ప్రభుత్వం అందిస్తున్న ఈ మూడు సేవలకు గాను రూ.235 వసూలు చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి దశలో 4 వేల పాఠశాలల్లో వర్చువల్ తరగతి గదులు ఏర్పాటు చేస్తున్నారు.