kulbhushan jadhav: కుల్‌భూషణ్ జాదవ్‌కు పాక్ చిత్రహింసలు.. బయటపడిన ఫొటోలు!
- జైల్లో కుల్‌భూషణ్‌పై పాక్ వికృత చర్యలు
- చిత్రహింసలు పెట్టినట్టు ఫొటోలలో ఆనవాళ్లు
- పాక్ తీరుపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు
పాకిస్థాన్ నిజస్వరూపం మరోమారు బయటపడింది. గూఢచర్యం ఆరోపణలపై మరణశిక్ష పడి, ప్రస్తుతం పాక్ జైల్లో వున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ను దారుణ చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఇందుకు సంబంధించి బయటకొచ్చిన చిత్రాలు పాక్ అరాచకాలను కళ్లకు కడుతున్నాయి. ఎన్నో ప్రయత్నాల తర్వాత కుమారుడిని కలిసేందుకు కుల్‌భూషణ్ తల్లికి, భార్యకు పాక్ అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే ఇందులోనూ కొన్ని ఆంక్షలు విధించారు. మధ్యలో అద్దాన్ని అడ్డుగా పెట్టి మాట్లాడుకునేలా ఏర్పాట్లు చేశారు. వారు ఏం మాట్లాడుకున్నారన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించారు. ఫొటోలు తీశారు.
ఇప్పుడా ఫొటోలు పాక్ నిజస్వరూపాన్ని ప్రపంచానికి వెల్లడించాయి. కుల్‌భూషణ్‌ను చిత్రహింసలకు గురిచేసినట్టు ఆ చిత్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన తల, చెవి భాగంలో, మెడ వద్ద గాయాలు కనిపిస్తున్నాయి. ఆయన పెట్టుకున్న చెవిపోగు కూడా కనిపించడం లేదు. దీంతో పాక్ జైలు అధికారులపై అనుమానాలు బలపడుతున్నాయి. ఆ ఫొటోలు చూస్తుంటే కుల్‌భూషణ్‌ను చిత్రహింసలకు గురి చేసింది నిజమే అనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ, గతంలో ఐక్యరాజ్య సమితిలో దౌత్యవేత్తగా పనిచేసిన శశిథరూర్ అనుమానం వ్యక్తం చేశారు. జాదవ్‌పై అమానుషంగా ప్రవర్తించిన పాక్‌పై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.