Chandrababu: రాయలసీమలో గాలి స్వచ్ఛత బాగుంది.. ఇక కోస్తాపై దృష్టి సారించాలి: చంద్రబాబు
- తాగునీరు, కరెంట్ సమస్యను అధిగమించాం
- ఇకపై కాలుష్య నియంత్రణపై దృష్టి
- రాయలసీమలో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి
రాష్ట్రంలో తాగునీటి సమస్యను, కరెంట్ సమస్యను అధిగమించామని... ఇకపై కాలుష్యంపై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వ్యవసాయం, నీరు-ప్రగతిపై ఈ రోజు ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గాలి స్వచ్ఛతపై దృష్టి పెట్టాలని సూచించారు. జల, వాయు కాలుష్య సమస్యల పరిష్కారంపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టే పద్ధతులకు ముగింపు పలకాలని అన్నారు.
రాయలసీమ జిల్లాల్లో గాలి స్వచ్ఛత బాగుందని... ఇక విశాఖ, గుంటూరు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో కాలుష్య సమస్య పరిష్కారానికి కృషి చేయాలని చెప్పారు. కాలుష్య సమస్య పరిష్కారం కోసం పంచాయతీరాజ్, అటవీ, పోలీస్, కాలుష్య నియంత్రణ సంస్థ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లు సమన్వయంగా పని చేయాలని ఆదేశించారు. రాయలసీమలో జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని... సీమ జిల్లాలకు సాగు నీరు ఇచ్చామని, పండ్ల తోటలను అభివృద్ధి చేశామని తెలిపారు.