YS: వైఎస్ కుటుంబానికి, మా కుటుంబానికి మధ్య విభేదాలు అప్పుడు మొదలయ్యాయి: కందుల రాజమోహన్ రెడ్డి
- మా వాడిని మంత్రిని చెయ్యంటూ వైఎస్ తండ్రి వచ్చేవారు
- నాటి సీఎం చెన్నారెడ్డి అందుకు ఒప్పుకోలేదు
- అప్పటి నుంచే వైఎస్, మా కుటుంబం మధ్య భేదాభిప్రాయాలు
- ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పిన కందుల
వైఎస్ కుటుంబానికి, తమ కుటుంబానికి మధ్య విభేదాలు ఏర్పడటానికి గల కారణాలను కందుల రాజమోహన్ రెడ్డి బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘మా నాన్నగారు ఓబుల్ రెడ్డి 1977లో ఎంపీ గా ఉన్నారు. 1978లో వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారిని ‘రెడ్డి కాంగ్రెస్’ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సమర్ధించింది మా నాన్న గారే. రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత.. ‘మా వాడిని మంత్రిని చెయ్యి’ అంటూ వైఎస్ తండ్రిగారు రాజారెడ్డి మా నాన్న గారి వద్దకు వచ్చేవారు. అప్పుడు, చెన్నారెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
‘కొత్తగా ఎమ్మెల్యే అయిన యువకుడిని మంత్రిని ఎలా చేస్తాం? ఇంకా టైముంది?’ అని చెన్నారెడ్డి గారు అనేవారు. అప్పటి నుంచి వైఎస్ కుటుంబానికి, మా కుటుంబానికి మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి.1985లో మా నాన్న గారు ఎంపీగా పోటీ చేసినప్పుడు రెండు కుటుంబాల మధ్య రాజీప్రయత్నాలు జరిగాయి. అయితే, మా నాన్న గారు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబం, మా కుటుంబం ఒకటిగా ఉండేందుకు రాజీ ప్రయత్నాలు ఎప్పుడూ జరగలేదు’ అని చెప్పుకొచ్చారు.