Ram Nath Kovind: ఒకేసారి వేల కెమెరాలతో ఆయా ప్రాంతాల పరిస్థితుల వీక్షణ.. అమరావతిలో ప్రత్యక్ష ప్రసారం వీక్షించనున్న రాష్ట్రపతి!
- వీడియో తెరపై రాష్ట్ర ప్రగతి వర్ణ సోయగం
- పాలనలో సాధిస్తోన్న ఫలాలపై ఏపీ ప్రభుత్వం ప్రజెంటేషన్
- అర్ధగంట పాటు రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ సందర్శన
- ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రేపు అమరావతికి వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. కోవింద్ ముందు రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక వినియోగంలో తాము చేసిన ప్రయోగాన్ని ప్రదర్శించనుంది. ఆసియాలోనే అతిపెద్ద పొడవైన (66 అడుగులు) వీడియో తెరపై ఒకేసారి రాష్ట్రంలోని వందల ఊర్లలోని సర్వైలెన్సు కెమెరాల ద్వారా అక్కడి తాజా స్థితిని ప్రత్యక్ష ప్రసారమయ్యే విధానాన్ని (రియల్ టైమ్ గవర్నెన్స్) ఏపీ ప్రభుత్వం.. రాష్ట్రపతికి చూపనుంది.
రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ సందర్శనలో రాష్ట్రపతి దాదాపు అర్ధగంట సేపు గడపనున్నారు. రేపు ఏపీ ఫైబర్ నెట్‌ను రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన తరువాత రాష్ట్రపతికి ఏపీ ప్రభుత్వం రియల్ టైమ్ గవర్నెన్స్‌ను చూపించనుంది. ఈ నేపథ్యంలో దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష జరిపారు. ఒకేసారి వేల కెమెరాల ద్వారా ఆయా ప్రాంతాల పరిస్థితులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా రాష్ట్రపతికి ఏపీ ప్రభుత్వం చూపనుంది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలను రాష్ట్రపతి ఒకే చోట నుంచి వీక్షిస్తారు. పరిపాలనలో సాంకేతిక నైపుణ్యం, పాలనలో సాధిస్తోన్న ఫలాలపై కూడా ఏపీ ప్రభుత్వం ప్రజెంటేషన్ ఇవ్వనుంది. రియల్‌టైమ్ గవర్నెన్స్ ని రాష్ట్రపతికి చూపించడానికి ఏపీ సర్కారు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేసింది.