reliance: కంపెనీ రుణాలను రూ.25 వేల కోట్లకు తగ్గించుకుంటాం: ఆర్ కాం అధినేత అనిల్ అంబానీ
- రుణభారాన్ని తగ్గించుకోనున్న ‘రిలయన్స్’
- దశల వారీగా అప్పులను తగ్గించుకుంటాం
- అనుసరించనున్న ప్రణాళికలు, వ్యూహాలను వివరించిన అధినేత
వచ్చే ఏడాది మార్చి నాటికి తమ కంపెనీ రుణాలను రూ.25 వేల కోట్లకు తగ్గించుకుంటామని రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కాం) అధినేత అనిల్ అంబానీ వెల్లడించారు. వ్యూహాత్మక రుణ పునర్ వ్యవస్థీకరణ (ఎస్ డీ ఆర్) ప్లాన్స్ పై ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణభారాన్ని తగ్గించుకోవడానికి అనుసరించనున్న ప్రణాళికలు, వ్యూహాలను ఆయన వివరించారు. స్పెక్ట్రమ్, టవర్, రియల్ ఎస్టేట్ స్థలాల విక్రయాల ద్వారా మొత్తం రుణాలను రూ. 45 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల దిగువకు తీసుకొస్తామని వెల్లడించారు.
అప్పులను ఈక్విటీల్లోకి మార్పు చేసే ఉద్దేశం లేదని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు దశల వారీగా అప్పులను తగ్గించుకుంటూ వస్తామని తెలిపారు. ప్రీ పేమెంట్స్ ద్వారా రూ. 25 వేల కోట్ల అప్పులను తగ్గించుకోనున్నామని, రుణదాతలు, బాండ్ హాల్డర్ల వాటాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.
కాగా, అక్టోబర్ చివరి నాటికి కంపెనీ మొత్తం అప్పులు రూ.45 వేల కోట్లు. ఇందులో రూ.7 వేల కోట్లను ఈక్విటీలోకి కంపెనీ మార్పు చేయాలని, ఎస్ డీ ఆర్ చేపట్టాలని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా సూచించింది. తమ సంస్థ అప్పులను తగ్గించుకుంటామని అనిల్ అంబానీ ప్రకటన చేసిన నేపథ్యంలో రిలయన్స్ సంస్థ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లో దూసుకెళ్లాయి. ఆర్ కాం షేర్ విలువ 41 శాతానికిపైగా లాభపడింది.