Tirumala: తిరుమలలో న్యూ ఇయర్ వేడుకలు ఉండవు!
- వైభవంగా జరిగిన అణివార ఆస్థానం
- ఆలయాన్ని శుద్ధి చేసిన అధికారులు
- జనవరి 1 హిందూ సంప్రదాయం కాదు
- ప్రత్యేక ఏర్పాట్లేవీ ఉండబోవన్న ఈఓ
ఈ సంవత్సరం నుంచి తిరుమలలో జనవరి 1న కొత్త సంవత్సరం వేడుకలు ఉండబోవని తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా, ఆలయ శుద్ధి కార్యక్రమం 'అణివార ఆస్థానం' వైభవంగా సాగగా, ఈఓ అనిల్ సింఘాల్ సహా అధికారులు, పురోహితులు, ఇతర సిబ్బంది పాల్గొని ఆలయాన్ని సుగంధ ద్రవ్యాలతో శుద్ధి చేశారు. ఈ సందర్భంగా అనిల్ సింఘాల్ మాట్లాడుతూ, వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నామని తెలిపారు.
ముందు రోజు ఉదయం నుంచే భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని, పరిమితంగా మాత్రమే ఏకాదశి వీఐపీ పాస్ లను అనుమతిస్తామని చెప్పారు. స్వయంగా వచ్చిన వీఐపీలకు మాత్రమే దర్శనం కల్పిస్తామని, సిఫార్సు లేఖలను అనుమతించబోమని అన్నారు. జనవరి 1వ తేదీన పండగ జరుపుకోవడం హిందూ సంప్రదాయం కాదని, అందువల్ల ఆరోజు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లేవీ ఉండవని చెప్పారు. గతంలో కొన్ని సార్లు తిరుమలలో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించామని, ఇకపై అలా జరగబోదని అన్నారు.