Tirumala: తిరుమలేశుని చెంత ఓ వినూత్న దందా... ఎంత నిఘా పెడుతున్నా నయా ప్లాన్లు వేస్తున్న అక్రమార్కులు!

  • క్యూ లైన్ సమయాన్ని ఆదా చేస్తామంటూ దందా
  • ముందే నడకదారి టికెట్లు బ్లాక్ చేస్తున్న దళారులు
  • వారికి సహకరిస్తున్న టీటీడీ సిబ్బంది
  • వెల్లువెత్తుతున్న విమర్శలు

తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తుల క్యూ లైన్ సమయాన్ని ఆదా చేస్తామని చెబుతూ టీటీడీ ఉద్యోగులతో కలసి అక్రమార్కులు సాగిస్తున్న నయా దందా ఇది. కాలిబాటలో వచ్చే భక్తుల సౌకర్యార్థం దివ్యదర్శనం టోకెన్ల జారీ తరువాత నడిచి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగగా, రోజుకు 20 వేల టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇక్కడే దళారుల రంగప్రవేశం జరిగింది. మామూలుగా ఉదయం టోకెన్ల జారీ ప్రారంభం కాగానే, మధ్యాహ్నానికి 20 వేల టోకెన్ల కోటా పూర్తవుతుంది. ఆపై వచ్చే వారంతా సర్వదర్శనం క్యూలో గంటల కొద్దీ వేచి చూసి దర్శనానికి వెళ్లాల్సిందే.

ఇదే అక్రమార్కులకు కలిసొచ్చింది. టోకెన్ల జారీ సిబ్బందితో లోపాయకారీ ఒప్పందాలు కుదుర్చుకుని, ముందే టోకెన్లు తీసుకుని, కోటా అయిపోయిందని చెప్పిస్తున్నారు. ఆపై కాలి నడక మార్గంలో మధ్యాహ్నం నుంచి మకాం వేసి, తాము టోకెన్లు ఇస్తామని, రెండు గంటల్లోనే దర్శనం అవుతుందని చెబుతూ, రూ. 300 నుంచి రూ. 500కు ఒక్కో టోకెన్ అమ్ముతున్నారు. నడిచి వెళ్లినా త్వరితగతిన దర్శనం జరగదన్న ఆందోళనలో ఉండే భక్తులు, ఈ దళారుల వద్ద టోకెన్లు కొంటున్నారు.

ఈ టోకెన్లను అలిపిరి వద్దే జారీ చేయడం, ఆపై గాలి గోపురం వద్ద వాటికి బయో మెట్రిక్ స్టిక్కర్ వేయడం, తరువాత ఎస్ఎస్ టెంపుల్ వద్ద స్టాంప్ వేసి పంపుతుంటారన్న సంగతి తెలిసిందే. అలిపిరిలోనే బయోమెట్రిక్ స్కాన్ చేస్తే దళారుల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. కానీ, దళారుల దందాపై నిఘా కొరవడిందని, అందువల్లే వారి ఆటలు సాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Loading...

More Telugu News