uno: మాతో పెట్టుకుంటే ఇంతే.. ఐక్యరాజ్యసమితికి భారీ షాక్ ఇచ్చిన అమెరికా!
- 285 మిలియన్ డాలర్ల కోత
- ప్రపంచ దేశాలు మమ్మల్ని ఒంటరిని చేశాయి
- అందుకే ఈ నిర్ణయం
జెరూసలెంను ఇజ్రాయల్ రాజధానిగా ప్రకటిస్తూ అమెరికా తీసుకున్న నిర్ణయం ఐక్యరాజ్యసమితిలో వీగిపోయిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. దీంతో, చిర్రెత్తుకొచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమకు వ్యతిరేకంగా ఓటు వేసిన దేశాలకు తాము ఇస్తున్న నిధుల్లో కోత విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఏకంగా ఐక్యరాజ్యసమితికే షాక్ ఇచ్చారు.
ఐక్యరాజ్యసమితి కార్యకలాపాల కోసం అన్ని దేశాల కంటే ఎక్కువగా అమెరికానే నిధులు ఇస్తుంటుంది. కానీ, 2018-19లో కేటాయించే నిధుల్లో 285 మిలియన్ డాలర్ల కోత విధిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలసి అమెరికాను ఒంటరిని చేశాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆర్థిక అంశాలపై తమకు పూర్తి అవగాహన ఉందని... అయినా, తాము చేయాలనుకున్నది చేస్తామని చెప్పారు. నిక్కీ హేలీ ప్రకటనతో ఐక్యరాజ్యసమితి షాక్ కు గురైంది.