jc divakar reddy: చేయి ఎత్తమంటే ఎత్తుతున్నాం.. దించమంటే దించుతున్నాం!: జేసీ దివాకర్ రెడ్డి
- కేంద్ర ప్రభుత్వంలో మా పరిస్థితి కరివేపాకులా తయారైంది
- నరేంద్ర మోదీకి ప్రస్తుతం ఏ పార్టీల దయాదాక్షిణ్యాలు అవసరం లేదు
- ఫుల్ మెజారిటీతో ఉన్నారు
టీడీపీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వంలో తమ పరిస్థితి కరివేపాకులా తయారైందని చెప్పారు. 'కూర వండేటప్పుడు అందరూ కరివేపాకును వేస్తారు.. కానీ, తినేటప్పుడు మాత్రం మొట్టమొదట తీసి పారేసేది కూడా కరివేపాకునే. ఆ రకంగా మేము కూడా అయిపోయాము.. మా పార్టీకే ప్రాధాన్యతలేదక్కడ. వారు చేయి ఎత్తమంటే ఎత్తుతున్నాం. దించు అంటే దించుతున్నాం.
నరేంద్ర మోదీకి ప్రస్తుతం ఏ పార్టీల దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. ఫుల్ మెజారిటీతో ఉన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడనివ్వరు. రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు చేస్తోన్న అభివృద్ధి పనులను చెప్పుకుని మేము ఎన్నికల్లో గెలవాల్సిందే తప్ప.. ఎంపీలము అది చేశాం, ఇది చేశాం అని చెప్పుకునే పరిస్థితి లేదు' అని ఆయన వ్యాఖ్యానించారు.