Andhra Pradesh: అనుమతి లేని బోటులో రాష్ట్రపతి సతీమణి, కుమార్తె.. అధికారుల తీరుపై విమర్శలు!
- భవానీ ద్వీపాన్ని సందర్శించిన రాష్ట్రపతి కుటుంబ సభ్యులు
- ప్రైవేటు బోటులో తరలించిన అధికారులు
- తిరుగు ప్రయాణంలో ప్రభుత్వ బోటు
ప్రస్తుతం ఏపీ పర్యటనలో ఉన్న రాష్ట్రపతి కోవింద్ సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి కలిసి బుధవారం పవిత్ర సంగమ సమీపంలో ఉన్న భవానీ ద్వీపాన్ని సందర్శించారు. ఇందుకోసం అధికారులు పున్నమిఘాట్ నుంచి వారిని అనుమతి లేని ప్రైవేటు బోటులో ద్వీపానికి తీసుకెళ్లారు. దీనిపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కృష్ణా నదిలో ప్రైవేటు బోట్లన్నింటినీ ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ఇప్పుడు రాష్ట్రపతి కుటుంబ సభ్యులను ఇలా ప్రైవేటు బోటులో తరలించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. అలాగే ఆ బోటులో ఎండ నుంచి రక్షణ లేకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది. తిరుగు ప్రయాణంలో మాత్రం పర్యాటక శాఖ బోటు ‘బోధిసిరి’లో తీసుకొచ్చారు. భవానీ ద్వీపానికి తీసుకెళ్లేటప్పుడు అదే పడవను ఉపయోగించి ఉంటే బాగుండేదని పలువురు పేర్కొన్నారు.
అంతకుముందు రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, స్వాతిలు ఇంద్రకీలాద్రిపై కొలువున్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి సహస్ర నామార్చన చేయించుకున్నారు.